Site icon NTV Telugu

Delhi Tension: ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్

Aicc Delhi

Aicc Delhi

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆఫీసుకి విచారణ కోసం రాహుల్ గాంధీ ఈరోజు కూడా వచ్చారు. గత రెండురోజులుగా గంటల కొద్దీ విచారణ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి, బస్సులలో వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు పోలీసులు.’మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?’ అని కాంగ్రెస్​ఎంపీ అధిర్ రంజన్​ చౌదరి.. పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.

ఈడీ కార్యాలయం వద్దకు చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేసిన యువజన నాయకులను కూడా బలవంతంగా బస్సులలో ఎక్కించుకుని అక్కడినించి తరలించారు పోలీసులు.ఈడీ కార్యాలయం వద్దకు రెండు మార్గాల్లో రెండు బృందాలుగా వచ్చారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. కార్లలో టైర్లు తీసుకు వచ్చి రోడ్డు పై దగ్ధం చేసింది యువజన కాంగ్రెస్ కార్యకర్తల బృందం. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జిందాబాద్​.. రాహుల్​ జిందాబాద్​ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు.

ఈడీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్య లో మొహరించి ఉన్న పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా బస్సుల్లో తరలించారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా, ప్రధాని మోడీ నిరంకుశ వ్యవహారశైలి నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు ఆందోళనకారులు. వీరిని అదుపుచేసేందుకు శ్రమపడ్డారు పోలీసులు. మరోవైపు ఆందోళనకు దిగిన యువజన కార్యకర్తలను రోడ్డు పై ఈడ్చుకెళ్లి బస్సుల్లో ఎక్కించారు పోలీసులు.

Jagadish Reddy: ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Exit mobile version