NTV Telugu Site icon

Belagavi: మరాఠీ మాట్లాడనందుకు బెళగావిలో కండక్టర్‌పై దాడి..

Belagavi

Belagavi

Belagavi: కర్ణాటక నగరమైన బెగళావిలో మరాఠీ మాట్లాడని కారణంగా బస్సు కండక్టర్‌ని కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కండక్టర్ గాయపడ్డారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతమైన ‘‘బెళగావి’’పై ఇరు రాష్ట్రాల మధ్య గత కొన్ని ఏళ్లుగా వివాదం ఉంది.

51 ఏళ్ల కండక్టర్ మహాదేవప్ప మల్లప్ప హుక్కేరి శుక్రవారం నాటు తనపై జరిగిన దాడి గురించి చెప్పారు. సులేభావి గ్రామంలో బస్సు ఎక్కిన ఒక మహిళ మరాఠీలో మాట్లాడిందని, తనకు మరాఠీ రాదని, కన్నడలో మాట్లాడతానని చెప్పానని హుక్కేరి చెప్పారు. ‘‘నాకు మరాఠీ తెలియదని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి మరాఠీ నేర్చుకోవాలని చెప్పి నన్ను తిట్టింది. అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి నా తలపై, శరీరంపై దాడి చేశారు’’ అని వెల్లడించారు.

Read Also: Bhupalpalli: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసుల పురోగతి..

గాయపడిన బస్సు కండక్టర్‌ను బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్చారు, అతనికి స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రమాదం నుంచి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. కండక్టర్‌పై దాడికి పాల్పడిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే 14 ఏళ్ల బాలిక కండక్టర్ తనను దుర్భాషలాడాడని కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య బెళగావి వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఈ నగరాన్ని తమ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో మరాఠీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉండటంతో, ఈ భాగాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలని ఓ వర్గం బలంగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు కన్నడ ప్రజలు ఈ డిమాండ్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.