Car Parking Clash: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలోని సోరాన్ పట్టణంలో కారు పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ హింసాత్మకంగా మారింది. ఈ వివాదం రెండు మతాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఈ ఘర్షణకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి, కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, సోరాన్ పట్టణంలో రోడ్డు పక్కన కారు నిలిపి ఉంచడాన్ని ఒక వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. కారు తన దారికి అడ్డుగా ఉందని చెబుతూ, కారు యజమాని రియాజ్ అహ్మద్‌ను దానిని అక్కడి నుంచి తరలించమని కోరాడు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం మరింత ముదిరడంతో కోపంతో అతడు ఆ వాహనాన్ని తన్నాడు. దీంతో క్షణాల్లో రెండు వైపుల సభ్యులు గుమిగూడటంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
Read Also: Kurnool Bus Accident: డ్రైవర్ అలా చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.. బాధితుడి ఆవేదన..
ఇక, ఈ గొడవ జరగడంతో కొంత మంది స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి వస్తుండగా, అవతలి వైపు నుంచి కొందరు వారిపై దాడి చేశారని ఆరోపించారు. దీంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడం, కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఉద్రిక్తతలు తలెత్తకుండా నిరోధించడానికి సున్నితమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘర్షణలో గాయపడిన రియాజ్ అహ్మద్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి కాస్‌గంజ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ పోలీసుల బందోబస్తును ముమ్మరం చేశామని చెప్పారు. మేము అనేక ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు సోదాలు చేసి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయడంతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
