NTV Telugu Site icon

Massive landslides: కులులో పేక మేడల్లా కూలిన భవనాలు

Massive Landslides

Massive Landslides

Massive landslides: భారీ వర్షాలు, వరదలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల మూలంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ చరియలు విరిగిభవనాలపై పడటంతో భవనాలు పేకమేడలా కూలిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొండచరియలు దేవాలయంపై పడటంతో దేవాలయంలో ఉన్న 9 మంది భక్తులు మృతి చెందారు. ఇప్పుడు మరికొన్ని కొండచరియలు విరిగిపడటంతో కులులో భవనాలు పేక మేడల్లా కూలుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండలను ఆనుకొని నిర్మించిన భవనాలు కూడా నేలకూలాయి. భవనాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. ఈ కొండచరియలు విరిగిపడటం, భవనాలు కూలిపోవడం, వెంటనే పెద్ద మొత్తంలో దుమ్మూ, దూళి లేవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: WFI India: ప్రపంచ వేదికపై భారత్‌కు భారీ షాక్‌.. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం రద్దు!

కులులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)తో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దిగాయి. ఈ దళాలతోపాటు స్థానిక అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కులు-మండి రహదారి దెబ్బతినడంతో కులు జిల్లాలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కులు జిల్లా నుంచి మండి వరకు ఉన్న రెండు రహదారులు ప్రభావితమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా పండోహ్ మీదుగా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైంది. రోడ్డు పనులను పునరుద్ధరించడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ప్రయత్నాలు చేస్తోంది.కులు జిల్లా నుంచి మండీని కలిపే రెండు మార్గాల్లో ప్రస్తుత వర్షాలకు నష్టం వాటిల్లిందని కులు ఎస్పీ సాక్షి వర్మ మీడియాకు తెలిపారు. పండోహ్ గుండా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైందని.. అయితే దానిని క్లియర్ చేసేందుకు పీడబ్లూడీ చురుకుగా పని చేస్తోందని తెలిపారు. గంటల తరబడి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆహారం, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. వారికి త్రాగునీరు, తినడానికి ఏమైనా అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.