Yogi Adityanath: హిమాలయ దేశం నేపాల్‌లో రాజరిక పాలన కోసం ప్రజలు గళమెత్తుతున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర కోసం ప్రజలు ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. నేపాల్‌లో ప్రజాస్వామ్యం వద్దని, మళ్లీ రాజరికం కావాలని కోరడం సంచలనంగా మారింది. అయితే, మార్చి 10న రాజు జ్ఞానేంద్రకు అనుకూలంగా త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జ్ఞానేంద్రతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Read Also: Minister Satya Kumar: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్
అయితే, సీఎం యోగి ఫోటో ఉండటం నేపాల్‌లో ఇప్పుడు వివాదానికి కారణమైంది. నిజానికి నేపాల్ రాచరికానికి యోగి మద్దతుదారుగా ఉన్నారు. జ్ఞానేంద్ర జనవరిలో ఉత్తర్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా యోగిని కలిశారు. మరోవైపు రాచరిక అనుకూల రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (RPP) నాయకులు, సభ్యులతో సహా మద్దతుదారులు మాజీ రాజుకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. వీరిలో కొంత మంది రాజు ఫోటోతో పాటు యోగి ఫోటోని ప్రదర్శించారు.
ఇప్పుడు నేపాల్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోని ప్రదర్శించడం వివాదాస్పదమైంది. అక్కడి రాజకీయ పార్టీలు అనేక విమర్శలు చేస్తున్నాయి. రాజరిక అనుకూల ర్యాలీలో కొందరు ఉద్దేశపూర్వకంగానే యోగి ఫోటోని ఉంచారని రాచరిక అనుకూల ఆర్పీపీ ఆరోపిస్తోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వమే దీనిని చేసిందని ఆరోపించింది. ప్రధాని ఓలి ముఖ్య సలహాదారు బిష్ణు రిమల్ సూచన మేరకే ఇలా చేశారని అన్నారు.