CM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. రాష్ట్రంలో పోలీసుల పాత్ర, నేరాల నియంత్రణ, డ్రగ్స్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థగా ఉండాలే తప్ప.. ప్రత్యేకమైన అధికార కేంద్రంగా మారకూడదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని, నేరానికి పాల్పడిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా చర్యలు తప్పవని పేర్కొన్నారు.
‘మంచివారికి పోలీసులు స్నేహితులు.. చెడ్డవారికి శత్రువులు’
అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ పోలీసు శాఖపై తన ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. ప్రజలకు భద్రత కల్పించడం, శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉండాలని అన్నారు. “పోలీసు శాఖ మంచి వ్యక్తులకు స్నేహితుడిగా, చెడు చేసే వారికి శత్రువుగా ఉండాలి. చట్టం అందరికీ సమానం. ఎవరైనా నేరానికి పాల్పడితే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇదే మా విధానం” అని సీఎం పేర్కొన్నారు. పోలీసులు స్వతంత్రంగా ఒక పవర్ సెంటర్‌గా మారకుండా, ప్రజలకు రక్షకులుగా వ్యవహరించాలని సూచించారు.
మూడు నెలల్లో జరిగిన నేరాలపై సీఎం వివరణ
గత మూడు నెలల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న నేరాలను ప్రస్తావిస్తూ.. అవన్నీ ఒక్కసారిగా జరిగిన ఘటనలు కాదని సీఎం విజయ్ అన్నారు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు, ప్రతీకార చర్యలు వంటి అనేక కారణాలు నేరాలకు దారితీస్తున్నాయని వివరించారు. నేరాలు జరిగిన ప్రతిసారీ మొత్తం బాధ్యత ప్రభుత్వంపైనే మోపడం సరికాదని అన్నారు. ప్రతీ నేరానికి దాని వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని, వాటిని గుర్తించి నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
డ్రగ్స్‌పై కఠిన చర్యలు
తమిళనాడులో పెరుగుతున్న డ్రగ్స్ సమస్యను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుందని సీఎం విజయ్ చెప్పారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కళాశాల విద్యార్థి హత్య కేసును ప్రస్తావించిన సీఎం.. ఈ కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు అసెంబ్లీలో తెలిపారు. యువతలో డ్రగ్స్ వినియోగానికి స్నేహితుల ఒత్తిడి, ఇతర సామాజిక కారణాలు కూడా కారణమవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. తమిళనాడులో డ్రగ్ కల్చర్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లు
డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెంచేందుకు రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు సీఎం విజయ్ వెల్లడించారు. చెన్నైలో NDPS చట్టం కింద గత మూడు నెలల్లో 330 కేసులు నమోదు చేసి, 556 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్ సమస్యను కేవలం పోలీసింగ్‌తో మాత్రమే పరిష్కరించలేమని, యువతలో అవగాహన, కుటుంబం, విద్యా సంస్థలు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
అవినీతిపై జీరో టాలరెన్స్
తమ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని సీఎం విజయ్ పునరుద్ఘాటించారు. అవినీతి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నేరాలు, అక్రమాలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి
మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. అవి జరగకుండా ముందుగానే అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం విజయ్ అన్నారు. మహిళలపై నేరాలను నిరోధించేందుకు ‘సింగపెన్ స్పెషల్ ఫోర్స్’ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

