The Kerala Story: గతేడాది వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళలోని మతమార్పిడిలు, తీవ్రవాద భావజాలం పెరుగుదల ఇతివృత్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను బీజేపీతో పాటు హిందూ సంస్థలు మద్దతు తెలుపగా.. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు దీనిని ప్రాపగండా సినిమాగా ఆరోపించాయి. కేరళలో ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
తాజాగా ఈ సినిమా దూరదర్శన్(డీడీ)లో టెలికాస్ట్ కాబోతోంది. అయితే, ఈ సినిమాను ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఖండించారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇది మత ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుందని, ఈ సినిమాను ప్రదర్శించడాన్ని ఉపసంహరించుకోవాలని డీడీని కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోసం ‘ప్రచారయంత్రం’గా మారవద్దని కోరారు. విద్వేషాలనను పెంచడానికి ఇలాంటి దురుద్దేశ ప్రయత్నాలను వ్యతిరేకించడంలో కేరళ స్థిరంగా ఉంటుందని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రచారం చేయాలని డీడీ నిర్ణయించింది.
Read Also: Tesla: జర్మనీ నుంచి ఇండియాకు టెస్లా కార్‌ల దిగుమతి.. RHD కార్ల ఉత్పత్తి ప్రారంభం..
లౌకక కేరళ సమాజాన్ని ధృవీకరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నంతో నిలబడవద్దని డీడీని కోరారు. కేరళలో బీజేపీ అడుగుపెట్టలేకపోయినందున తమ రాజకీయ ఎజెండానున ముందుకు తీసుకెళ్లాని భావించి, సార్వత్రిక ఎన్నికల ముందు ఈ వివాదాస్పద చిత్రాన్ని ప్రదర్శించాలని బీజేపీ నిర్ణయించుకుందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం ఆరోపించింది. ఇది కేరళ సమాజాన్ని సవాల్ చేయడమే అని, ఈ సినిమా విడుదలైనప్పుడు కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని, సెన్సార్ బోర్డు స్వయంగా సినిమాలోని 10 సన్నివేశాలను తొలగించిందని సీపీఎం పేర్కొంది.
గతేడాది ఈ సినిమా విడుదల తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సినిమా ట్రైలర్‌లో ఏ ఒక్క వర్గానికి అభ్యంతరం కలిగిచే అంశాలు లేవని సినిమాపై స్టే విధించేందుకు గతేడాది కేరళ హైకోర్టు నిరాకరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాను పరిశీలించి, ప్రదర్శనకు అనువుగా ఉందని కోర్టు పేర్కొంది. కేరళకు చెందిన 32,000 మహిళలు మతం మారారని, తీవ్రవాదంలో బలవంతంగా చిక్కుకున్నారని ట్రైలర్‌లో చూపించడం వివాదాస్పదమైంది.