CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్

  • మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
  • గత సంస్కృతికి భిన్నంగా వ్యవహరించిన విజయ్
  • తాజా ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయిన స్టాలిన్
Cmvijay2

Cmvijay2

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులపై పగ ప్రతీకారాలు తీర్చుకునే సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతికి గత స్టాలిన్ హయాంలోనే ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ అయితే మరింత భిన్నంగా నడుచుకుంటున్నారు.

తాజా ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి స్వయంగా సీఎం విజయ్ వెళ్లి పరామర్శించారు. విజయ్ ఇంటికి రాగానే స్టాలిన్ శాలువాతో సత్కరించారు. ముందుగా ఉదయనిధి స్టాలిన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం స్టాలిన్ ఆలింగనం చేసుకున్నారు. స్టాలిన్‌ను కలిసి పలు సూచనలు, సలహాలు, అనుభవాలు కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. సహజంగా ఓడిపోయిన ప్రత్యర్థుల ఇళ్లకు ఏ ముఖ్యమంత్రి వెళ్లరు. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా స్టాలిన్ నివాసానికి వెళ్లి పరామర్శించడం దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.

మే 4న విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. పూర్తి మెజార్టీతో వస్తేనే ప్రమాణం చేయిస్తానని గవర్నర్ అర్లేకర్ తేల్చి చెప్పడంతో విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. దీంతో డీఎంకే కూటమిలో భాగమైన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్షాలు మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 120కి చేరింది. దీంతో ఆదివారం ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక సోమవారం ఉదయం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. తొలుత విజయ్ ప్రమాణం చేయగా.. అనంతరం మిగతా ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేశారు.