CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం

  • ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం
  • తమిళనాడులో రాజకీయ దుమారం
  • బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే విమర్శలు
Cmvijay

Cmvijay

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న నిర్ణయం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, కేవీఎన్ గ్రూప్ చైర్మన్ కే. వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఒక సంవత్సరం పాటు తాత్కాలికంగా అమల్లో ఉంటుందని, సేవా నిబంధనలను ప్రత్యేకంగా ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

అయితే ఈ నియామకం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. విజయ్ నటించిన ‘జన నాయకన్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న వెంకట నారాయణను ఈ కీలక పదవిలో నియమించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. గతంలో కూడా వ్యక్తిగత జ్యోతిష్యుడు, ఆధ్యాత్మిక సలహాదారు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమించారు. అయితే ఈ నియామకంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ‘జన నాయకన్’ చిత్ర నిర్మాత వెంకట నారాయణను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

ఎవరు వెంకట నారాయణ?

కే. వెంకట నారాయణకు వ్యాపార రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ సీఈవోగా పనిచేశారు. అనంతరం 2020లో KVN ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘జన నాయకన్’ చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా సెన్సార్ అనుమతులకు సంబంధించిన సమస్యల కారణంగా ఇంకా విడుదల కాలేదు.

బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే విమర్శలు

ఈ నియామకాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. వెంకట నారాయణకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మేకేదాటు జల వివాదం కొనసాగుతున్న సమయంలో అలాంటి వ్యక్తిని ఢిల్లీలో తమిళనాడు ప్రతినిధిగా నియమించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.

డీఎంకే కూడా ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తింది. రాజ్యసభ సభ్యుడు పి. విల్సన్ మాట్లాడుతూ.. ఒక సినిమా నిర్మాతను ఇంత కీలక పరిపాలనా బాధ్యతలకు ఎంపిక చేయడం ద్వారా ఆ పదవి గౌరవాన్ని తగ్గించినట్లవుతుందని అన్నారు. అన్నాడీఎంకే కూడా ఇదే తరహాలో విమర్శలు చేసింది. ‘‘ముఖ్యమంత్రి సినిమా నిర్మిస్తే చాలు.. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అయ్యే అర్హత వచ్చేస్తుందా?’’ అంటూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రశ్నించింది. కర్ణాటకకు చెందిన వ్యక్తిని తమిళనాడు తరఫున నియమించడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపించింది.

విజయ్‌కు అత్యంత సన్నిహితుడు

మే నెలలో ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్ గవర్నర్ అర్లేకర్‌ను కలిసిన సమయంలో కూడా వెంకట నారాయణ ఆయన వెంట ఉన్నారు. దీంతో విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరు వినిపిస్తోంది.

ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలేంటి?

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం-కేంద్ర ప్రభుత్వానికి మధ్య కీలక వారధిగా వ్యవహరిస్తారు. కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం, మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర నిధుల సాధన, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కేంద్రం ముందు బలంగా వినిపించడం వంటి బాధ్యతలు ఈ పదవికి ఉంటాయి. గత రెండు దశాబ్దాల్లో ఈ బాధ్యతలను డీఎంకేకు చెందిన కే. సెల్వేంద్రన్, ఏ. అశోకన్, అన్నాడీఎంకేకు చెందిన ఎన్. తలవాయి సుందరం, డీఎంకే నేత ఏకేఎస్ విజయన్ నిర్వహించారు. ఇప్పుడు అదే కీలక పదవికి సినిమా నిర్మాత వెంకట నారాయణను నియమించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.