CM KCR Bihar visit: ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులకు చెక్కులు పంపిణీ చేశారు సీఎం కేసీఆర్. బీహర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందించారు. ఇదే విధంగా హైదరాబాద్ అగ్నిప్రమాదంలో మరణించిన 12 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. గాల్వాన్ లో వీరసైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యతని.. వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా భావిస్తామని.. చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనుకున్నాం అని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Also: Mallu Ravi: కొండారెడ్డి పల్లి జవాన్ కుటుంబానికి న్యాయం ఎప్పుడు?
అంతకు ముందు బుధవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బీహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నాలో సీఎం కేసీఆర్‌ను ఘనంగా స్వాగతించారు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలకు ఎంతో సాయం చేసింది.. ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలాగా స్పందించలేదు.. మిషన్ భగీరథను ఎలా చేశారో చూసి రావాలని మా అధికారులను తెలంగాణకు పంపాని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు.
అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేదని.. అందుకే పాట్నాకు వచ్చి ఈ పవిత్ర భూమి కి చెందిన అమరులైన సైనికులకు మా వంతు సహాయం చేస్తున్నాంమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కోల్పోయిన ప్రాణాలను మేము తిరిగి తీసుకురాలేమని.. అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలి. దీంతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రం అని ఈ రాష్ట్రాభివృద్ధిలో బీహార్ కు చెందిన వేలమంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. వీరు ఎన్నో రంగాల్లో పని చేస్తున్నారని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా…. వారిని తెలంగాణ ప్రతినిధులుగా భావిస్తున్నామని నేను ఆ సమయంలో చెప్పానని.. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఎంతోమంది కార్మికులు, శ్రామికులను వారివారి రాష్ట్రాలకు తరలించామని..పని కోసం తెలంగాణకు వలస వచ్చిన వారందరికి మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని మేమ భావిస్తున్నామని కేసీఆర్ అన్నారు. మేము గోదావరి నది ఒడ్డు నుండి గంగా నది ఒడ్డుకు వచ్చామని.. గంగా నదిని పవిత్రనదిని భావించనట్లుగానే తెలంగాణలో గోదావరి నదిని దక్షిణ గంగగా భావిస్తామని అన్నారు. జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన పవిత్ర భూమి బీహార్ అని.. బీహార్ ప్రజల చైతన్యంతో ప్రారంభమైన ప్రతీ మార్పు ఈ దేశంలో శాంతికి దారి తీసిందని పొగిడారు. బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రకమైందని.. ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
