Site icon NTV Telugu

Himachal Floods: అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్.. ముగ్గురు మృతి.. కొట్టుకుపోయిన వాహనాలు

Himachal Floods

Himachal Floods

హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు వెంటాడుతున్నాయి. ఇటీవల భారీ వరదలు కారణంగా రాష్ట్రం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. తేరుకునేలోపే మరోసారి జలఖడ్గం విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున మండిలో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. కుండపోతగా కురిసిన వర్షంతో మండి అతలాకుతలం అయింది. ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బతుకుజీవుడా అంటూ స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

అందరూ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. నిద్రలోంచి తేరుకునేలోపే అకస్మాత్తుగా వరదలు ముంచుకొచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ప్రకృతి విధ్వంసంతో మండి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. రహదారులు మూసుకుపోయాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. అంతా అంధకారం.. ఏం చేయాలో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోయారు. కళ్లు తెరిచి చూసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాహనాలు, వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: పెళ్లిళ్ల సీజన్ వేళ.. దిగొచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

ప్రస్తుతం జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని వెతికి తీస్తున్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అధికారులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Haryana: కన్వరియాలు ఘాతుకం.. కక్షతో జవాన్‌ కాల్చివేత.. 4రోజుల క్రితమే భార్య ప్రసవం

ఇక ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో కిరాత్‌పూర్-మనాలి నాలుగు లేన్ల జాతీయ రహదారులు, పఠాన్‌కోట్-మండి జాతీయ రహదారులు మూసివేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌ వరదలు కారణంగా మరణాల సంఖ్య 164కి చేరుకుంది. జూన్ 20 నుంచి రాష్ట్రం రూ.1,523 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసిందని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం అంచనా వేసింది.

Exit mobile version