మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సివిల్ జడ్జి అభ్యర్థి అర్చన తివారీ అదృశ్యం మిస్టరీ వీడింది. ఆగస్టు 7న రైలు ప్రయాణంలో అదృశ్యమైన అర్చన తివారీ (29) ఆచూకీపై పోలీసులకు కీలక సమాచారం అందింది. రైల్లో ప్రయాణం చేస్తూ ఆమె అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో మూడు బృందాలు రంగంలోకి దిగి జల్లెడ పట్టాయి. ఎట్టకేలకు ఇన్ని రోజులకు ఆమె ఆచూకీ లభించింది.
ఇది కూడా చదవండి: Earthquake: హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. వణికిన ప్రజలు
అర్చన తివారీ క్షేమంగానే ఉన్నట్లు ఆమె సోదరుడు దివ్యాంశు మిశ్రా తెలిపారు. అయితే ఆమెకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తెలియజేస్తారని పేర్కొన్నాడు. భోపాల్ రైల్వే డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ కుమార్ లోధా మాట్లాడుతూ.. అర్చన తివారీకి సంబంధించి పోలీసులకు కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయని చెప్పారు. ఆ వివరాలు ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు. ఇక అర్చన తివారీ తన తల్లితో కూడా ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎక్కడ ఉన్నట్లో కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమెను తీసుకొచ్చేందుకు ప్రస్తుతం పోలీసులు బృందాలు వెళ్తున్నాయి.
అసలేం జరిగింది..
అర్చన తివారీ.. సివిల్ జడ్జి పదవికి సిద్ధపడుతోంది. ఆగస్టు 7న ఇండోర్ నుంచి కట్నికి వెళ్లడానికి బయల్దేరింది. ఆగస్టు 7న మధ్యాహ్నం 2:20 గంటలకు హాస్టల్ నుంచి అర్చన తివారీ ఇండోర్ రైల్వేస్టేషన్‌కు బయల్దేరింది. సాయంత్రం 4:10 గంటలకు ఇండోర్-బిలాస్‌పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్(18233) ఎక్కింది. ఏసీ కోచ్ బీ-3 సీటు దగ్గర కూర్చుంది. ఇది తలుపు దగ్గర ఉంది. రైలు భోపాల్ సమీపంలోకి వచ్చినప్పుడు అర్చన తివారీ తన తల్లితో ఫోన్‌లో సంభాషించింది. అప్పుడు రాత్రి 10:16 గంటలు అయింది. ఇక ఆగస్టు 8న నర్మదా ఎక్స్‌ప్రెస్ ఉదయం 6:50 గంటలకు కాట్నీ సౌత్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కానీ అర్చన మాత్రం స్టేషన్‌లో దిగలేదు. బ్యాగ్ మాత్రం ఉమారియా స్టేషన్‌లో పోలీసులు కనుగొన్నారు. ఇక అర్చన ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో మూడు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి.
ఇది కూడా చదవండి: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో 71 మంది మృతి!
నర్మదా ఎక్స్‌ప్రెస్ రాత్రి 10:05 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరింది. రాత్రి 11:26 గంటలకు నర్మదాపురం చేరుకుంటుంది. భోపాల్ నుంచి నర్మదాపురం చేరుకోవడానికి గంట 21 నిమిషాలు పడుతుంది. ఈ గంట 21 నిమిషాల్లో ఏం జరిగింది అనేది సస్పెన్ష్‌గా మారింది. అయితే రైలు మిడ్‌ఘాట్‌లోని దట్టమైన అడవి గుండా రైలు వెళ్తుంది. చాలాసార్లు పులులు నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులపై దాడి చేసిన సందర్భాలున్నాయి. అర్చన సీటు కూడా తలుపు దగ్గరే ఉంది. వాష్‌రూమ్‌కు వెళ్లే సమయంలో ఏమైనా పులి ఏదైనా దాడి చేసిందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక నర్మదాపురం వరకు అర్చన ఫోన్ సిగ్నల్ వచ్చింది. ఒకవేళ నదిలో గానీ పడి ఉండొచ్చేమోనని నదిలో కూడా గజ ఈతగాళ్లతో కూడా గాలించారు. లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఒకవేళ కిడ్నాప్ చేస్తే.. తోటి ప్రయాణికులు అప్రమత్తం అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఆరోజు రైలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. కనుక అలాంటిది జరిగి ఉండదేమోనని భావించారు. ఇంకా లేదంటే ఏదైనా ప్రేమ వ్యవహారం కారణంగా తల్లిదండ్రులకు తెలియకుండా అదృశ్యమైందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే అర్చన ఫోన్ సమాచారాన్ని సేకరించగా.. ఏ అబ్బాయితోనూ ఎక్కువగా మాట్లాడిన దాఖలాలు కూడా కనిపించలేదు.
ప్రస్తుతం ఇండోర్ నుంచి కాట్నీ రైల్వే స్టేషన్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. అయితే అర్చన బ్యాగ్ మాత్రం సీటు దగ్గరే కనుగొన్నారు. ఇక హాస్టల్‌లో ఎవరితోనో ఎక్కువగా మాట్లాడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ప్రస్తుతం ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సహచరులను, హాస్టల్ నిర్వాహకులను కూడా ప్రశ్నించారు. తాజాగా అర్చన కుటుంబ సభ్యులతో టచ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఉన్న చోటికి పోలీసులు వెళ్తున్నారు. ఆమెను తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. అసలేం జరిగిందో వివరించనున్నారు.
