China Praises Modi: ప్రధాని నరేంద్రమోడీపై చైనా ప్రశంసలు కురిపించింది. మోడీ హయాంలో భారత్ ఆర్థిక, సామాజిక పాలన, విదేశాంగ విధానాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని చైనీస్ స్టేట్ మీడియా ఏజెన్సీ గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. అభివృద్ధి చెందడంలో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని తన ఆర్టికల్‌లో వ్యాఖ్యానించింది. షాంఘైలోని ఫుడాన్ యూనివర్శిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసిన కథనాన్ని ప్రముఖ ప్రభుత్వ-చైనీస్ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. గత నాలుగేళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాలను గురించి ప్రస్తావించింది.
భారత బలమైన ఆర్థిక వృద్ధి, అర్బన్ గవర్నెన్స్ లో మెరుగుదల, అంతర్జాతీయ సంబంధాల్లో, ముఖ్యంగా చైనాతో తన వైఖరి మార్పును గురించి ప్రస్తావించింది. ‘‘ చైనా, భారత్ మధ్య వాణిజ్య అసమతుల్యత గురించి చర్చిస్తున్నప్పుడు.. భారత ప్రతినిధులు వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చైనా చర్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. కానీ ఇప్పుడు వారు భారత దేశ ఎగుమతి సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు’’ అని జాంగ్ తన కథనంలో పేర్కొన్నారు. వేగవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధితో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా ‘భారత కథనాన్ని’ రూపొందించడంలో, అభివృద్ధి చేయడంలో మరింత క్రియాశీలకంగా మారిందని కథనం పేర్కొంది.
Read Also: Gun Firing: అమెరికాలో కాల్పుల కలకలం.. తుఫాకీతో కాల్చి చంపిన టీనేజర్..
‘‘రాజకీయ మరియు సాంస్కృతిక రంగాలలో, భారతదేశం పాశ్చాత్య దేశాలతో తన ప్రజాస్వామ్య ఏకాభిప్రాయాన్ని నొక్కి చెప్పడం నుండి ప్రజాస్వామ్య రాజకీయాల ‘భారతీయ లక్షణాన్ని’ హైలైట్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం, ప్రజాస్వామ్య రాజకీయాల యొక్క భారతీయ మూలాలపై మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంది’’ అని చెప్పింది. చారిత్రక వలస రాజ్యాల నీడ నుంచి తప్పించుకోవడానికి, రాజకీయంగా, సాంస్కృతికంగా ‘విశ్వ గురు’గా వ్యవహరించాలనే ఆశయాన్ని భారత్ ప్రతిబింబిస్తోందని ఆర్టికల్‌లో జాంగ్ చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంలో తటస్థవైఖరని అవలంభిస్తూనే యూఎస్, జపాన్, రష్యా వంటి ప్రధాన ప్రపంచ దేశాలతో సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశ విదేశాంగ విధాన వ్యూహాన్ని ప్రసంచించింది. విదేశాంగ విధానంలో భారత్ వ్యూహాత్మక ఆలోచన మార్పుకు గురైందని, గొప్ప శక్తి వ్యూహం వైపు కదులుతుందని చైనా మీడియా తెలిపింది. ప్రధాని మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి యూఎస్, జపాన్, రష్యాలతో సంబంధాలను మరింతగా ప్రోత్సహిస్తు్న్నారని, భారతదేశం ఎల్లప్పుడూ తనను తాను ప్రపంచ శక్తిగా పరిగణిస్తోందని చెప్పింది. ప్రపంచంలో ఇంత వేగంగా విదేశాంగ విధానం రూపాంతంర చెందడం చాలా అరుదుగా కనిపిస్తోందని భారతదేశాన్ని పొగిడారు. అనేక దేశాలు భారత్‌ని పరిగణించాల్సిన భౌగోళిక రాజకీయ అంశంగా మారిందని ఆర్టికల్ పేర్కొంది.
