Site icon NTV Telugu

Arunachal Pradesh: “అరుణాచల్‌”పై చైనా కన్ను, డ్రాగన్ ప్రధానాసక్తుల్లో ఒకటి: యూఎస్ రిపోర్ట్..

Xi Modi

Xi Modi

Arunachal Pradesh: భారత అంతర్భాగమైన ‘‘అరుణాచల్ ప్రదేశ్’’ తమదే అని, అది దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు అరుణాచల్ తమ దేశం నుంచి విడదీయలేని అంతర్భాగమని భారత్ కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికన్ కాంగ్రెస్‌కు సమర్పించిన పెంటగాన్ నివేదికలో, అరుణాచల్ ప్రదేశ్ చైనా ‘ప్రధాన ఆసక్తుల్లో’ ఒకటిని చెప్పింది. అరుణాచల్‌పై చైనా రాజీకి, చర్చలకు సిద్ధంగా లేదని నివేదిక పేర్కొంది.

చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని వివాదస్పద ప్రాంతాలు, జపాన్ సమీపంలోని సెన్‌కాకు దీవులతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ను తన ప్రధాన ఆసక్తుల్లో ఒకటిగా చేర్చిందని నివేదిక పేర్కొంది. చైనా అధికారుల ప్రకారం, వివాదాస్పద భూభాగాలతో సహా దేశ ఏకీకరణను 2049 నాటికి సాధించాలని, ‘‘చైనా జాతీయ మహా పునరుజ్జీవనం’’ అవసరమని చెబుతున్నారు. ఆ దశలో చైనా ప్రపంచ స్థాయిలో కొత్త శక్తిగా ఎదిగి, యుద్ధంలో గెలిచే సామర్థ్యం ఉన్న ప్రపంచస్థాయి సైన్యాన్ని కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది.

Read Also: Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..

జాతీయ పునరుజ్జీవనానికి కేంద్రంగా ఉన్న, చర్చలకు, రాజీకి ఆస్కారం లేని మూడు ‘‘కోర్ ఇంట్రెస్ట్’’లను చైనా గుర్తించిందని నివేదిక పేర్కొంది. వీటిలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) నియంత్రణ, చైనా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను రక్షించడం,విస్తరించడం ఉన్నాయి.

భారత్, చైనా సంబంధాల గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. భారత్-చైనాల మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి జరుగుతున్న పరిణామాలను నివేదిక నొక్కి చెబుతుంది. అక్టోబర్ 2024లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు జి జిన్ పింగ్, ప్రధాని నరేంద్రమోడీ మధ్య సమావేశానికి రెండు రోజుల ముందు ఎల్ఏసీ వెంబడి ప్రతిష్టంభన ప్రదేశాల నుంచి రెండు దేశాల సైన్యం వైదొలగాలని భారత్, చైనాల మధ్య ఒప్పందాన్ని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. చైనా, భారత్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి , అమెరికాతో భారత సంబంధాలు మరింత పెరగకుండా నిరోధించడమే కారణమని పేర్కొంది. అదే సమయంలో చైనా చర్యలు, ఉద్దేశాలపై భారత్ సందేహంగా ఉండే అవకాశం ఉదని, నిరంతరం పరస్పర అపనమ్మకం, ఇతర చికాకులు ద్వైపాక్షిక సంబంధాన్ని పరిమితం చేయడం దాదాపు ఖాయమని నివేదిక పేర్కొంది.

Exit mobile version