NTV Telugu Site icon

India-China: చైనా కుయుక్తులు..లడఖ్ సరిహద్దుల్లో ఫైటర్ జెట్ల మోహరింపు

Jpg

Jpg

డ్రాగన్ దేశం తన కుయుక్తులను మానడం లేదు. ఒక వైపు నమ్మిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. లడఖ్ సరిహద్దు వెంబడి నిర్మాణాలను చేపడుతోంది. సైనిక సన్నద్ధతను పెంచుకుంటోంది. ఇటీవల భారత్ సరిహద్దు వెంబడి చైనా మిలిటరీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆందోళనకరమని అమెరికన్ మిలటరీ అధికారి అభివర్ణించిన తరుణంలో మరో ఘటన బయటపడింది.

తూర్పు లడఖ్ ను అనుకుని ఉన్న చైనా హోటాన్ ఎయిర్ బెస్ వద్ద అత్యాధునిక పైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎయిర్ బేస్ భారత సరిహద్దును అనుకుని ఉంది. ఇందులో 25 వరకు ఫ్రంట్‌లైన్ విమానాలను మోహరించినట్లు తేలింది. నివేదిక ప్రకారం ఇందులో చైనా అత్యాధునిక జే-11, జే-20 విమానాలు ఉన్నట్లు తేలింది. అంతకు ముందు అక్కడ మిగ్-21 విమానాలు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి స్థానంలో మరింత సామర్థ్యం మరియు అధునాతన విమానాలు మరియు పెద్ద సంఖ్యలో మోహరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భారత భూభాగానికి దగ్గరగా చైనా కొత్త ఎయిర్ ఫీల్డ్ లను నిర్మిస్తోంది. ఇవి తక్కువ ఎత్తుల నుంచి ఆపరేషన్ లు నిర్వహించడానికి వీలు కల్గించేవిగా ఉన్నాయి. ఇటీవల యూఎస్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్, చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో చేస్తున్న మౌలిక సదుపాయాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నాడు.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలపై భారత్ నిశితంగా గమనిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లఖడ్ వరకు ఇండియా ఆర్మీ అప్రమత్తంగా ఉంది. హోటాన్‌తో పాటు, జిన్‌జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లోని గార్ గున్సా, కాష్‌ఘర్, హాపింగ్, డ్కోంకా ద్జోంగ్, లింజి, పంగట్ ఎయిర్‌బేస్‌లపై కూడా ఇండియా కన్నెసింది. ఎల్ఏసీ వైపు చైనా బలగాలకు ధీటుగా ఇండియా కూడా ఆర్మీని పెంచుతోంది. సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29, మిరాజ్ -2000 ఫైటర్ జెట్లను ఫార్వర్డ్ ఎయిర్ బేస్ ల వద్ద మోహరించింది.