Chhattisgarh Congress: ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ఆఫీస్‌లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!

Chhattisgarh Congress

Chhattisgarh Congress

Chhattisgarh Congress: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఒక వింతైన, విస్తుపోయే దొంగతనం వెలుగుచూసింది. గాంధీ చౌక్ ప్రాంతంలోని విఐపి జోన్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ‘రాజీవ్ భవన్’ లోకి గుర్తు తెలియని దొంగలు చొరబడిన .. అక్కడ చేసిన పని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే..

72 నల్లాలు మాయం.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
ఆఫీస్ బాత్రూమ్‌లలోని ఖరీదైన నల్లాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, వెళ్తూ వెళ్తూ అక్కడ దొంగలు వదిలివెళ్లిన ఒక లేఖ పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ఘటన స్థానిక శాంతిభద్రతలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ భవన్ బాత్రూమ్‌లలో ఉన్న దాదాపు 72 ఖరీదైన వాటర్ ట్యాప్‌లను (నల్లాలను) దొంగలు చాలా చాకచక్యంగా విరగ్గొట్టకుండా ఊడదీసుకుని వెళ్లారు. దొంగతనం చేసిన తర్వాత, ఏమాత్రం భయం లేకుండా ఆఫీస్ నేలపై “లవ్ యూ” (Love You) అని రాసి మరీ పారిపోయారు. వారు ఎంత పక్కా ప్లానింగ్‌తో, నింపాదిగా ఈ పని చేశారంటే.. వారికి పోలీసులన్నా, దొరికిపోతామన్నా అస్సలు భయం లేనట్లు స్పష్టమవుతోంది.

మూడోసారి టార్గెట్..
ఈ దొంగతనం గురించి సమాచారం అందుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పాఠక్ వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగరం నడిబొడ్డున, విఐపి జోన్‌గా పరిగణించే ఏరియాలోనే ఇలాంటి దొంగతనం జరగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ భవన్‌లో దొంగతనం జరగడం ఇది మొదటిసారి కాదు, ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. నగరంలో యాక్టివ్‌గా ఉన్న డ్రగ్స్ బానిసలు, అసాంఘిక శక్తులే ఈ పని చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దొంగతనం చేసి నేలపై ‘లవ్ యూ’ అని సందేశం రాయడం.. నేరుగా ఇక్కడి పోలీస్ యంత్రాంగాన్ని, పరిపాలనను వెక్కిరించడమేనని బాలకృష్ణ పాఠక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నగరం నడిబొడ్డున ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆఫీసులోనే భద్రత లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దొంగల ధైర్యం చూస్తుంటే ఇక్కడ శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయో అర్థమవుతోంది” అని అన్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.