ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకుంటారు సెక్యూరిటీ సిబ్బంది.. కానీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.. అదేంటి? సీఎం ఏంటి? కొరడా దెబ్బలు కొట్టించుకోవడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. అయితే.. ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి రెండో రోజు ఉదయం ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. దుర్గ్ జిల్లా పటాన్ బ్లాక్‌లోని జజంగిరి గ్రామానికి వెళ్లారు.. అక్కడ గౌర్-గౌరీకి పూజలు చేసి.. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అయితే, ఛత్తీస్‌గఢ్ సంప్రదాయం ప్రకారం గౌర్-గౌరి దగ్గరకు వెళ్లిన వారు కొరడాతో కొట్టించుకొని.. మొక్కలు చెల్లించుకుంటారు..
Read Also: Narayana Murthy: ప్రధానిగా అల్లుడు.. మామ ఆనందం..
ఇంతకీ ముఖ్యమంత్రిని ఎందుకు కొట్టారంటే.. ఛత్తీస్‌గఢ్ సంప్రదాయం ప్రకారం, గౌర్-గౌరీ పూజ సందర్భంగా చేసే ఈ ఆచారం చెడును పోగొట్టి, శ్రేయస్సును కలిగిస్తుందని నమ్మకం. రాష్ట్ర శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం ఈ జానపద ఆచారంలో పాల్గొంటారు.. ఇవాళ గౌర్-గౌరీ పూజలో పాల్గొన్న సీఎం భూపేష్ బాఘేల్ చేతిపై వీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి కొరడాతో కొట్టారు. అనంతరం జంగ్‌గిరి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ ఇలాగే మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతిసారీ మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉందని, దీపావళి ఆనందాన్ని మీతో పంచుకోవడం నా మనసుకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.. గౌర్-గౌరీని పూజించడం వల్ల కలిగే ఆనందం.. మీతో పెరుగుతుందని.. ఎంత అందమైన సంప్రదాయం.. పండుగ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు..