NTV Telugu Site icon

Chhattisgarh: కూలిన చిమ్మీ.. నలుగురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ముంగేలిలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. బిలాస్‌పూర్, పెండ్రా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా వంటి పొరుగు జిల్లాల నుంచి విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు చనిపోయారని.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు ముంగేలి కలెక్టర్ రాహుల్ తెలిపారు. ముంగేలిలోని సర్గావ్‌లోని ఇనుము తయారీ కర్మాగారంలో సిలో స్ట్రక్చర్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మరియు అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని ముంగేలి కలెక్టర్‌ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్‌లో ఇనుప పైపులు తయారు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో తొమ్మిది మంది వరకు చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ప్రమాదం విషయం తెలియగానే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం సంఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. పరిసర ప్రాంతాల నుంచి జిల్లా అధికార బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు.

 

 

Show comments