Drug Racket: ఇప్పుడు యువతను డ్రగ్స్ పట్టి పీడిస్తోంది.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా.. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు.. ఇలా గుట్టుగా మార్కెట్లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.. ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నాయి.. తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాధవరం రౌండౌట్ సమీపంలో కారులో రహస్యంగా తరలిస్తున్న సుమారు 70 కిలోల హెరాయిన్‌ను అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.350 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఉంటుందని భిన్నమైన అంచనాలు వెలువడుతున్నాయి.
ముందస్తుగా అందిన నిఘా సమాచారంతో అప్రమత్తమైన DRI అధికారులు మాధవరం రౌండౌట్ వద్ద అనుమానాస్పద కారును అడ్డగించి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో రహస్యంగా తరలిస్తున్న హెరాయిన్ బయటపడింది. వెంటనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితులను ఆలందూరు కోర్టులో హాజరుపరిచారు. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏ రాష్ట్రం నుంచి చెన్నైకి తరలిస్తున్నారు? ఈ డ్రగ్స్ వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నైలో వెలుగుచూసిన ఈ భారీ డ్రగ్స్ పట్టివేత ప్రస్తుతం సంచలనంగా మారింది.

