India Fuel Demand: భారతదేశ ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. డిమాండ్ కు తగినట్లుగా ఫిబ్రవరిలో రోజుకు 5 శాతం కంటే ఎక్కువగా ఇంధన వినియోగం పెరిగి రోజుకు 4.82 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది వరసగా 15వ సంవత్సరం పెరుగుదలను సూచిస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా.. భారత ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టమని పేర్కొంది.
Read Also: Holi Harassment: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు
ఫిబ్రవరి నెలలో భారత దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో పాటు దేశీయ డిమాండ్ కాకుండా, రష్యా నుంచి చౌకగా ఇంధనం కొనుగోలు చేస్తుండటం కూడా ఇంధన డిమాండ్ పెరుగుదలకు కారణం అయింది. ప్రస్తుతం ఇండియా, రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తోంది. డిస్కౌంట్ ఇస్తుండటంతో భారత్ విరివిగా చౌకగా రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఇండియా చమురు దిగుమతుల్లో సంప్రదాయ చమురు ఎగుమతిదారులుగా ఉన్న ఇరాక్, సౌదీ అరేబియాను తోసేసి రష్యా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 35 శాతం వాటాను రష్యా ఆక్రమించింది.
ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 8.9 శాతం పెరిగి 2.8 మిలియన్ టన్నులకు చేరుకోగా, డీజిల్ వినియోగం 7.5 శాతం పెరిగి 6.98 మిలియన్ టన్నులకు చేరుకుంది.అదే సమయంలో, జెట్ ఇంధనం అమ్మకాలు 43 శాతం కంటే ఎక్కువ పెరిగి 0.62 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే వంటగ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ అమ్మకాలు 0.1 శాతం తగ్గి 2.39 మిలియన్ టన్నులకు పడిపోయాయి. రోడ్ల నిర్మాణానికి వాడే బిటుమెన్ అమ్మకాలు కూడా నెలవారీగా 21.5 శాతం పెరిగాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఇంధన చమురు వినియోగం 5 శాతం కన్నా కొద్దిగా తగ్గింది.
