Chandigarh Mayor Polls: బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తొలిపోరుగా భావిస్తున్న చండీగఢ్ మేయర్ ఎలక్షన్ ఈ రోజు జరగబోతోంది. మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గత 8 ఏళ్లుగా బీజేపీ చేతలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, ఆప్ చేతులు కలిపాయి. దీంతో ఈ ఎన్నికల ప్రాధాన్యత సంతరించుకుంది. 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎంపీ కిర్రోన్ ఖేర్ ఉన్నారు. ఇక ఆప్‌కి 13 మంది, కాంగ్రెస్‌కి ఏడుగురు, శిరోమణి అకాళీదల్‌కి ఒక కౌన్సిలర్ ఉన్నారు.
ఇదిలా ఉంటే, మేయర్ పదవి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పంజాబ్-హర్యానా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. మేయర్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా, ప్రక్రియను పర్యవేక్షించడానికి కోర్టు కమిషనర్‌ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే దీనిని విచారించిన న్యాయమూర్తులు దీపక్ సిబల్, దీపక్ మంచాందాలతో కూడిన డివిజన్ బెంచ్ అంగీకరించలేదు. ఆప్ నేత రాఘవ్ చద్దా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవర్ కుమార్ బన్సాల్ ఈ ఎన్నికల కోసం ఒక ముందు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని రాఘవ్ చద్దా ధీమా వ్యక్తం చేశారు.
2022, 2023లో కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 5 ఏళ్ల సభ వ్యవధిలో ప్రతీ ఏడాది మూడుస్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది మేయర్ స్థానాన్ని షెడ్యూల్డ్ కులానికి రిజర్వ్ చేశారు. ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇండియా కూటమి వద్ద మొత్తం 20 ఓట్లు ఉన్నాయి. దీంతో మేయర్ స్థానాన్ని సులభంగా గెలుచుకుంటామని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ మనోజ్ సోంకర్, కుల్జీత్ సంధు, రాజిందర్ శర్మను నిలబెట్టింది. ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ టిటా మేయర్ స్థానానికి పోటీపడగా, కాంగ్రెస్ నామినీలు గురుప్రీత్ సింగ్ గాబీ, నిర్మలా దేవిలు సీనియర్ డిప్యూటీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ స్థానాలకు పోటీ చేస్తున్నారు.
