NTV Telugu Site icon

Chandan Gupta Murder Case: చందన్ గుప్తా హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితులకు జీవిత ఖైదు

Chandanguptamurdercase

Chandanguptamurdercase

ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్ల క్రితం మత ఘర్షణలో హత్యకు గురైన చందన్ గుప్తా కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 28 నిందితులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది. 2018, జనవరి 26న కాస్‌గంజ్‌లో జరిగిన తిరంగా యాత్ర సందర్భంగా మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో చందన్ గుప్తాను కాల్చి చంపేశారు. ఇటీవల 28 మందిని దోషులుగా తేల్చగా.. శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. నిందితులకు జీవిత ఖైదు విధించింది.

జిల్లా ప్రభుత్వ న్యాయవాది మనోజ్ కుమార్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ… చందన్ గుప్తా హత్య కేసులో నిందితులందరికీ జీవిత ఖైదు విధించబడినట్లు తెలిపారు. అయితే ఇద్దరు వ్యక్తులపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించిందని చెప్పారు. నసీరుద్దీన్, అసిమ్ ఖురేషీ అనే వ్యక్తులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

నిందితులపై 307 (హత్య ప్రయత్నం), 302 (హత్య) సహా ఐపీసీలోని అనేక సెక్షన్ల కింద 28 మంది నిందితులను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. జాతీయ గౌరవాన్ని అవమానించడం నిరోధక చట్టం, 1971 కింద కోర్టు వారిపై అభియోగాలు మోపింది. జీవిత ఖైదు పడిన వారిలో సలీం, వసీం, నాసిం, జాహిద్, ఆసిక్ ఖురేషి , అస్లాం ఖురేషి, అక్రమ్, తౌఫీక్, ఖిల్లాన్, షబాబ్, రహత్, సలాం, మొహ్సిన్, ఆసిఫ్ జిమ్వాలా, సాకిబ్, బబ్లూ, నిషు, వాసిఫ్, ఇమ్రాన్, షంషాద్, జాఫర్, సకీర్, ఖలీద్ పర్వేజ్, ఫైజాన్, ఇమ్రాన్ ఖయ్యూమ్, సకీర్ సిద్ధిఖీ, మునాజీర్ రఫీ, అమీర్ రఫీ ఉన్నారు. ఈ 28 మంది నిందితుల్లో మునాజీర్ రఫీ.. కాస్‌గంజ్‌లో లాయర్ మోహిని తోమర్ హత్య కేసులో ఇప్పటికే జైలులో ఉన్నాడు. మిగతా నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారు. వీరిలో 26 మంది గురువారం లొంగిపోగా… మిగిలిన నిందితులు సలీం శుక్రవారం లొంగిపోయాడు.

చందన్ గుప్తా హత్య కేసు వివరాలు..
2018, జనవరి 26న విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి సంఘాలు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగాలు, హిందూ మితవాద సంస్థల సభ్యుల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం, కుంకుమ జెండాలతో పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు. బుద్దునగర్ ప్రాంతంలోకి యాత్ర ప్రవేశించేటప్పటికీ ఆకస్మాత్తుగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో ఏబీవీపీ కార్యకర్త చందన్ గుప్తాను కాల్చి చంపేశారు. అనంతరం పరిస్థితులు చేదాటిపోయాయి. అనంతరం మూడు దుకాణాలు, రెండు బస్సులు, కారు తగలబెట్టారు. తొలుత కాస్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేయగా.. అనంతరం ఈ కేసు ఎటాలోని జిల్లా కోర్టుకు తరలించారు. అక్కడ నుంచి 2022లో లక్నోలోని ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేశారు.

 

 

 

Show comments