Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరడం ఖరారైంది. బీజేపీలో చేరాలనే తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. గిరిజనుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీనే అని అన్నారు. సంతాల్ పరగణాలో గిరిజనులు గుర్తింపును రక్షించేందుకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, గిరిజన హక్కుల కోసం పాటుపడాలని తన మద్దతుదారుల్ని కోరారు. చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నారు.
Read Also: Minu Muneer: “హగ్ చేసుకొని ముద్దు పెట్టారు”.. లైంగిక వేధింపులపై నటి సంచలనం
ఆదివాసీల గుర్తింపు, అస్తిత్వాన్ని కాపాడే ఏకైక పార్టీ బీజేపీనే అని ట్వీట్ చేశారు. ఇతర పార్టీలు ఓట్ల కోసమే ఆరాటపడుతున్నాయని కాంగ్రెస్, జేఎంఎం పరోక్షంగా విమర్శించారు. గిరిజనుల కోసం మాట్లాడుతూ.. బాబా తిల్కా మాంఝీ, సిడో-కాన్హుల పుణ్యభూమి అయిన సంతాల్ పరగణాలో నేడు బంగ్లాదేశ్ చొరబాట్లు పెద్ద సమస్యగా మారాయని, ఈ చొరబాటుదారులు ఆక్రమించుకోవడం కంటే దురదృష్టం ఏముంటుంది..? నీరు, అడవి, భూమి కోసం విదేశీ బ్రిటీష్ వారి బానిసత్వాన్ని ఎన్నడూ అంగీకరించని ఈ భూమి పుత్రులు మన తల్లులు, సోదరీమణుల, కుమార్తెల గౌరవం ప్రమాదంలో పడినప్పుడు ఎలా చూస్తూ ఊరుకుంటారని అన్నారు. రాజకీయాతోనే కాదు, సామాజిక ఉద్యమాల ద్వారా గిరిజనుల్ని రక్షించగలమని ఆయన పేర్కొన్నాడు.
జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలో సీఎం హేమంత్ సోరెన్ తర్వాత చంపాయ్ సోరెన్ కీలక నేతగా ఉన్నారు. భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో చంపాయ్ సోరెన్ సీఎం అయ్యారు. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తనను అవమానకరమైన రీతిలో సీఎం పదవి నుంచి దించారని చంపాయ్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా కేబినెట్ మీటింగ్, ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన బీజేపీలో చేరబోతున్నారు.
