IndiGo CEO vs Central Govt: ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అయితే, ఈ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పదవి నుంచి తొలగించేలా బోర్డుకు ఆదేశాలు జారీ చేసే ఛాన్స్ ఉందని నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. అలాగే, ఇండిగోపై భారీగా జరిమానా విధించేందుకు రంగం సిద్ధమవుతుందని పౌర విమానయాన శాఖ సీనియర్ అధికారుల కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది.
Read Also: JEE Advanced 2026 Exam Date: విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది..
అయితే, ఇప్పటికే ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా లేక ఆదేశాలను పట్టించుకోకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక, గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో ఇండిగో సర్వీసులు రద్దవుతున్నాయి. ఈరోజు (డిసెంబర్ 6న) కూడా పలు ఎయిర్‌పోర్టుల్లో వందలకు పైగా సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుంది.. కొన్ని సరీసులపై ప్రభావం కొనసాగుతోందని చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కూడా రంగంలోకి దిగింది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జోడించడంతో పాటు ప్రత్యేకంగా పలు రైళ్లను కూడా నడుపుతుంది.
