Supreme Court: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేయడంపై బుధవారం నాడు తక్షణ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తావించారు. ఇటీవలి పరిణామాల గురించి న్యాయస్థానానికి వివరిస్తూ ఈ సమస్యను రేపు విచారించాలని కోరారు. దీనిపై బుధవారం విచారణ జరుపుతామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఫిఫా నిర్ణయంతో అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును కోల్పోయింది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని(థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యం ఉందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేసింది. అనవసరమైన ప్రభావం ఉన్నందున తక్షణమే అమలులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. “ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన థర్డ్ పార్టీల నుండి అనవసర ప్రభావం కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని ఫిఫా(FIFA) ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) తన రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
FIFA: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసిన ఫిఫా.. ఎందుకో తెలుసా?
సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్‌లో జరగాల్సిన ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. భారత్ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నమెంట్‌కు సంబంధించి తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని, అవసరమైతే, కౌన్సిల్ బ్యూరోకు రిఫర్ చేస్తామని ఫిఫా తెలిపింది. ఈ మేరకు భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిఫా పాలకమండలి తెలిపింది.
