CNG Rates: సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకురాబోతోంది. ధర పరిమితి విధించేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ఏ, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ధర 10 శాతం వరకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధర 6 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ గురువారం తెలిపారు.
Read Also: Sri Maha Lakshmi Stotram: కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి లాంటి శ్రీమహాలక్ష్మి స్తోత్రాలు
ఈ మార్పలకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో శనివారం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇటీవల కాలంలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు 80 శాతం మేర పెరిగిన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యుడికి ఊరట కలగనుంది. 2030 నాటికి ఇండియా ఇంధన వాడకంలో సహజవాయువు వాటాను ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం వల్ల సహజవాయువు వినియోగాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు సహాయపడుతుంది.
కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల వినియోగదారుడికి సహాయపడుతుందని ఇంధన మంత్రి హర్దీప్ పూరీ ట్వీట్ చేశారు. భారత దేశంలోని గ్యాస్ ధరలపై విదేశాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హెన్రీ హబ్, అల్బెనా, నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్(బ్రిటన్), రష్యా అనే 4 గ్యాస్ ట్రేడింగ్ హబ్ లలో ధరల ఆధారంగా దేశీయ గ్యాస్ ధరలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నిర్ణయించేవారు. అయితే ఈ విధానాన్ని కేంద్రం తాజాగా మార్చబోతోంది.