Fertiliser Subsidy for Rabi: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. గతేడాది కంటే 64 శాతం పెంపు

Farmer

Farmer

Fertiliser Subsidy for Rabi: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రబీ 2026-27 సీజన్‌కు సంబంధించి ఎరువుల సబ్సిడీ కోసం రూ.62,370 కోట్ల కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఏడాది రబీ సీజన్‌లో కేటాయించిన రూ.37,952 కోట్లతో పోలిస్తే ఈసారి 64.3 శాతం అధికంగా నిధులు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.24,418 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ ఎరువుల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడం, హార్మూజ్‌ జలసంధి మీదుగా నౌకాయానంపై ఆంక్షలు విధించడం వంటి పరిణామాలు ఎరువుల సరఫరాను ప్రభావితం చేశాయి. ప్రపంచ ఎరువుల రవాణాకు హార్మూజ్‌ జలసంధి కీలక మార్గం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు ఎరువులు అందుబాటు ధరల్లో లభించేలా సబ్సిడీని పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ఎరువుల ధరలు

గల్ఫ్ ప్రాంతంలో సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) 2024 వాణిజ్య గణాంకాల ప్రకారం.. భారత్ దిగుమతి చేసుకునే నత్రజని ఆధారిత ఎరువుల్లో దాదాపు మూడింట రెండొంతులు గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయి. దీంతో అక్కడి పరిణామాలు భారత ఎరువుల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యూరియా ధరలు గతంలో టన్నుకు సుమారు 400 డాలర్లుగా ఉండగా, యుద్ధ ప్రభావంతో ఏప్రిల్‌లో 850 డాలర్లకు పైగా పెరిగాయి. డీఏపీ (డై అమ్మోనియం ఫాస్ఫేట్) ధరలు కూడా టన్నుకు 580 డాలర్ల నుంచి 770 డాలర్లకు చేరాయి. అయితే జూన్ నాటికి యూరియా ధరలు కొంత తగ్గి 453 డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు ఫాస్ఫేట్ ఎరువుల సరఫరా మాత్రం ఇంకా పరిమితంగానే ఉండటంతో ధరల ఒత్తిడి కొనసాగుతోంది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ సెప్టెంబర్‌లో నిర్వహించిన అంచనా ప్రకారం.. ఫాస్ఫేట్ సరఫరాలు ఇంకా కొరతతో పాటు అధిక ధరలను ఎదుర్కొంటున్నాయి. ఎరువుల తయారీకి అవసరమైన సల్ఫర్ కొరత కూడా ఉత్పత్తి, వాణిజ్యంపై ప్రభావం చూపుతోంది. నత్రజని మార్కెట్లు మాత్రం క్రమంగా యుద్ధానికి ముందు స్థాయిలకు చేరువవుతున్నాయి.

పోషక ఆధారిత సబ్సిడీ పథకం అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం 2010 ఏప్రిల్ నుంచి పోషక ఆధారిత సబ్సిడీ (Nutrient Based Subsidy – NBS) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 28 రకాల ఫాస్ఫేటిక్, పొటాషిక్ (P&K) ఎరువులకు సబ్సిడీ అందిస్తోంది. ఎరువుల్లో ఉండే పోషకాల పరిమాణాన్ని బట్టి సబ్సిడీని లెక్కిస్తారు. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సబ్సిడీ రేట్లను సవరిస్తుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డీఏపీ, ఎన్‌పీకేఎస్ సహా వివిధ రకాల ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులకు సంబంధించి 2026 అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమల్లో ఉండే సబ్సిడీ రేట్లకు ఆమోదం తెలిపారు.

రైతులకు సబ్సిడీతో కలిగే ప్రయోజనాలు

కేంద్రం ఆమోదించిన సబ్సిడీని నిర్ణీత రేట్ల ప్రకారం నేరుగా ఎరువుల కంపెనీలకు అందజేస్తారు. తద్వారా రైతులకు ఎరువులు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా ఆ భారం పూర్తిగా రైతులపై పడకుండా ఈ సబ్సిడీ ఉపయోగపడుతుంది. రబీ పంటల సాగు సమయంలో అవసరమైన పోషకాలు అందుబాటులో ఉండటంతో పాటు ఎరువుల సరఫరా కొనసాగేందుకు దోహదపడుతుంది. గత రబీ సీజన్‌లో కిలో నత్రజనికి రూ.43.02, ఫాస్ఫేట్‌కు రూ.47.96, పొటాష్‌కు రూ.2.38, సల్ఫర్‌కు రూ.2.87 చొప్పున పోషక ఆధారిత సబ్సిడీని కేంద్రం నిర్ణయించింది. ఈసారి పెరిగిన కేటాయింపులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.