బీజేపీ సీనియర్ నేత, మైనారిటీ విభాగంలోని కీలక నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న ఆయన పదవీకాలం రేపటితో అయిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు వేసేందుకు ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఉంది. కాబట్టి ఆయన రేపటి వరకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కొనసాగినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఇవాళే రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాను ఈరోజు ఉదయం కలవటంతో ఆయన ఉపరాష్ట్రపతిగా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రొఫైల్..
కేంద్ర మంత్రిగా, రాజ్యసభ ఎంపీగానే కాకుండా పెద్దల సభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా కూడా వ్యవహరించిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 1957 అక్టోబర్ 15న ఉత్తరప్రదేశ్(యూపీ)లోని అలహాబాద్‌లో జన్మించారు. తండ్రి పేరు ఏహెచ్ నఖ్వీ. తల్లి పేరు సకినా బేగం. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నోయిడాలోని ‘ఏసియన్ అకాడమీ ఆఫ్ హయ్యర్ స్టడీస్’లో ఆర్ట్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివారు. 1983 జూన్ 8న సీమ నఖ్వీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు. 64 ఏళ్ల ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 2010 నుంచి 2016 వరకు యూపీ తరఫున, 2016 నుంచి ఇవాళ్టి వరకు జార్ఖండ్ తరఫున ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించారు. 1975లో అంటే 17వ ఏటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. అప్పటికే ఆయన స్టూడెంట్ లీడర్‌గా జనతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
1980లో జనతా పార్టీ (సెక్యులర్) తరఫున యూపీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా నిలబడి ఓటమి పాలయ్యారు. తర్వాత 18 ఏళ్లకు అంటే 1998లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ మధ్యకాలంలో పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా చేశారు. 2014, మే 26న మోడీ మొదటి కేబినెట్‌లో మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. 2016 జూలై 12న నజ్మా హెప్తుల్లా రాజీనామాతో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా స్వతంత్ర హోదా పొందారు. 2019 మే 30న మోడీ రెండో కేబినెట్‌లోనూ మైనారిటీ వ్యవహారాల మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. మూడు పుస్తకాలు (స్యాహ్, దంగా, విశాలి) రాశారు.