Site icon NTV Telugu

Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఖైదీలంతా విడుదల

Prision

Prision

జైళ్లలో సత్ప్రవర్తన కనబరుస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 50ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఖైదీలకు శిక్ష తగ్గించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మొత్తం శిక్షాకాలంలో సగానికి పైగా శిక్ష పూర్తి చేసుకున్న 60ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగులైన ఖైదీలకు కూడా జైలు శిక్షను తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే మరణ శిక్ష, జీవిత ఖైదు పడిన వారికి, అత్యాచారం, తీవ్రవాద అభియోగాలు ఉన్న వారికి, వరకట్న చావులకు, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొన్న వారికి ఈ పథకం వర్తించదని హోం మంత్రిత్వ శాఖ వివరించింది.

Read Also:Flight Emergency Landing: దుబాయ్‌కి వెళ్లే స్పైస్‌జెట్ కరాచీలో అత్యవసర ల్యాండింగ్

ఈ ఏడాది ఆగస్టు 15న కొందరిని, వచ్చే ఏడాది జనవరి 26 మరికొందరిని, 2023 ఆగస్టు 15న మరికొందరిని మొత్తం మూడు విడతల్లో ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని జైళ్ల అధికారులకు సమాచారం పంపింది. మరోవైపు కేవలం జరిమానా విధించలేక శిక్ష అనుభవిస్తున్న పేద ఖైదీలు కూడా ఈ పథకం ద్వారా విముక్తి పొందనున్నారు. వారి జరిమానాను మాఫీ చేయడం ద్వారా వారికి శిక్షాకాలం నుంచి విముక్తి లభించనుంది. కాగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా ఖైదీలకు శిక్ష తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

Exit mobile version