ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి ఎందరో ఆర్థికపరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. చేజేతులా వేలు, లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. కొందరైతే.. అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ వేసిన సందర్భాలున్నాయి. మరికొందరు ప్రాణాలే కోల్పోయారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో తరచుగా వెలుగు చూస్తుండడంతో.. కేంద్రం సీరియస్ అయ్యింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాల్సిందిగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవల ఆ మీడియాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రకటనలు పెరిగిన నేపథ్యంలో.. కేంద్రం ఈ సూచనలు చేసినట్లు తెలిసింది.
‘‘దేశంలోని చాలా ప్రాంతాల్లో బెట్టింగ్, జూదం వంటివి చట్టవిరుద్ధం. ఇవి వినియోగదారులకు.. ముఖ్యంగా యువత, పిల్లలకు ఆర్థిక, సామాజిక ప్రమాదాల్ని కలగజేస్తున్నాయి. కాబట్టి, ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కి సంబంధించిన ప్రకటనల్ని ప్రచురించవద్దు. ఒకవేళ ప్రకటనలు వేస్తే, అది చట్టవిరుద్ధమైన చర్యను ప్రోత్సాహించినట్లు అవుతుంది. ఆన్‌లైన్ అడ్వర్టయిజ్‌మెంట్ పబ్లిషర్స్, మధ్యవర్తులు సహా సోషల్ మీడియాలు సైతం వాటికి దూరంగా ఉండాలి’’ అని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రకటనల నివారణ ద్వారా, ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు యువతను దాదాపు దూరం చేసినట్టే అవుతుంది. ఎక్కడా ప్రకటనలు రావు, ఆయా బెట్టింగ్స్ గురించి తెలిసే ఆస్కారం ఉండదు. ఒకరకంగా ఇది మంచి పరిణామమే!