కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. వాటిని 1 చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడింటిని విలీనం చేస్తూ ఢిల్లీ నగరం మొత్తాన్ని ఒకే మునిసిపల్ కార్పొరేషన్ కిందకు తీసుకురానున్నారు అధికారులు. ఇదివరకే ప్రతిపాదించిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం-2022ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.ఈ మేరకు ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఏకీకరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 22 నుంచి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది అధికార యంత్రాంగం. ఢిల్లీలోని 3 మునిసిపల్ కార్పొరేషన్లను విలీనం చేసే దిశగా కేంద్రం చేపట్టిన చర్యలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఢిల్లీ మునిసిపల్ సవరణ చట్టాన్ని కేంద్రం ప్రతిపాదిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే.. ఇప్పటికే అక్రమణ పేరుతో మున్సిపల్ అధికారులు ఢిల్లీలో ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు.
