Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!

  • కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు
  • తీరనున్న రైల్వే ఇబ్బందులు
Cabnit

Cabnit

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని కీలక రైల్వే మార్గాల్లో రవాణా సామర్థ్యాన్ని పెంచడం, రద్దీని తగ్గించడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.20,804 కోట్ల విలువైన ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. 7 రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. విశాఖ-విజయవాడ మీదుగా నాలుగు లేన్ల రైల్వే నెట్‌వర్క్‌ చేపట్టనున్నారు. అలాగే ముంబై-చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు-రేణిగుంట మీదుగా 4 లేన్ల నిర్మాణం చేయనున్నారు.

గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే ఆధునికీకరణలో భాగంగానే ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. “ప్రధాని మోడీ నాయకత్వంలో రైల్వేల సమగ్ర ఆధునికీకరణ జరుగుతోంది. భవిష్యత్తులో భారీ రవాణా ఉండే మార్గాలతో పాటు ఏడు హై-డెన్సిటీ రైల్వే కారిడార్లలో నాలుగు లైన్లు, క్వాడ్రప్లింగ్ పనులు చేపడుతున్నాం” అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

మూడు ప్రాజెక్టులకు రూ.10,783 కోట్లు

కేబినెట్ ఆమోదించిన ప్రాజెక్టుల్లో భాగంగా రూ.10,783 కోట్లతో మూడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో ఖరగ్‌పూర్–ఝార్సుగూడ (బాగ్‌దేహి) నాలుగో రైల్వే లైన్, కట్ని–పెండ్రా రోడ్ నాలుగో లైన్,
బిలాస్‌పూర్ (ఉస్లాపూర్)–పెండ్రా రోడ్ మూడో లైన్జ ఈ మూడు ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేయనున్నాయి. మొత్తం సుమారు 656 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నాయి. దీంతో సుమారు 4,790 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ అందనుంది. దాదాపు 56 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు ప్రాజెక్టులు

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఐదు రైల్వే ప్రాజెక్టులకు రూ.10,021 కోట్ల మేర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆ ప్రాజెక్టులు..

అరకోణం–రేణిగుంట: మూడో, నాలుగో రైల్వే లైన్లు – 77 కి.మీ
వైట్‌ఫీల్డ్–బంగారుపేట: మూడో, నాలుగో లైన్లు – 47 కి.మీ
హోసూర్–ఓమలూరు: డబ్లింగ్ – 147 కి.మీ
సేలం–కరూర్–దిండిగల్: డబ్లింగ్ – 159 కి.మీ
సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)–కాజీపేట: మల్టీ-ట్రాకింగ్ – 110 కి.మీ
ఈ ఐదు ప్రాజెక్టుల ద్వారా సుమారు 540 కి.మీ మేర రైల్వే నెట్‌వర్క్ పెరగనుంది. మొత్తం 17 జిల్లాలు ఈ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి. సుమారు 2,121 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభించనుండగా.. దాదాపు 52 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.

రైళ్ల రద్దీ తగ్గింపు.. సేవల్లో మెరుగుదల

ఈ ప్రాజెక్టుల ద్వారా రైల్వే లైన్ల సామర్థ్యం పెరగడంతో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు సేవల విశ్వసనీయత మెరుగుపడనుంది. రైళ్ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టడంతో మార్గాల్లో రద్దీ కూడా తగ్గనుంది. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు. మల్టీమోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా సమగ్ర ప్రణాళిక, వివిధ భాగస్వాములతో సంప్రదింపుల ఆధారంగా వీటిని చేపడుతున్నారు.

పర్యాటక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ

కొత్త రైల్వే ప్రాజెక్టుల వల్ల పలు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కూడా రైలు కనెక్టివిటీ మెరుగుపడనుంది. తిరుపతి, తిరుత్తణిలోని సుబ్రమణ్య స్వామి ఆలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, హోగెనక్కల్ జలపాతాలు, హోసూర్ కోట, మేట్టూర్ డ్యామ్, కొడైకెనాల్ కొండలు, సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం, యాదాద్రిగుట్ట ఆలయం, భువనగిరి కోట తదితర ప్రాంతాలకు మెరుగైన రైల్వే సదుపాయం అందనుంది.

సరుకు రవాణాకు భారీ ప్రయోజనం

ఈ రైల్వే మార్గాలు బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల రవాణాకు కూడా ఎంతో ముఖ్యమైనవి. దక్షిణాది రాష్ట్రాల్లో చేపట్టే ఐదు ప్రాజెక్టుల ద్వారా అదనంగా 47 MTPA (ఏటా 4.7 కోట్ల టన్నుల) సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు సుమారు 8 కోట్ల లీటర్ల చమురు దిగుమతులను తగ్గించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. సుమారు 42 కోట్ల కిలోల CO₂ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది దాదాపు 2 కోట్ల చెట్లను నాటడంతో సమానం.

మరో మూడు ప్రాజెక్టులతోనూ భారీ ప్రయోజనం

ఇప్పటికే ఆమోదించిన మూడు ప్రాజెక్టుల ద్వారా అదనంగా 27 MTPA సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది. వీటి వల్ల సుమారు 12 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా సుమారు 62 కోట్ల కిలోల CO₂ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది దాదాపు 2.48 కోట్ల చెట్లను నాటడంతో సమానం. మొత్తంగా ఈ ప్రాజెక్టులు దేశ రైల్వే రవాణా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చనున్నాయి.