Site icon NTV Telugu

Delhi: ఇరాన్‌లో జాబ్ ఆఫర్లపై జాగ్రత్త.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

Delhi5

Delhi5

ఇరాన్‌లో నకిలీ ఉద్యోగ ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలంటూ భారతీయులకు కేంద్రం హెచ్చరించింది. క్రిమినల్ ముఠాలు తప్పుడు ఉద్యోగ హామీలతో వ్యక్తులను ఆకర్షించి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు భారతీయులెవరూ బలికావొద్దని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ కోరింది. ఇరాన్ వీసా రహిత దేశమని.. ఈ నేపథ్యంలో ఉపాధి పేరుతో తప్పుడు ప్రకటనలు ఇచ్చి మోసం చేస్తున్నారని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: EPFO Passbook Lite: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్.. ఒక్క క్లిక్ తో పూర్తి వివరాలు..

ఉపాధి కల్పిస్తామని.. అలాగే ఇతర దేశాలకు పంపిస్తామని కొందరు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో భారతీయులు మోసపోయి.. ఇరాన్ వెళ్లాక కిడ్నాప్‌కు గురవుతున్నారు. ఇటీవల పలువురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. వారి విడుదల కోసం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇలా చాలా మంది లక్షలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రకటనలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే ఇరాన్‌ ప్రభుత్వం భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తోందనే విషయాన్ని గమనించాలని కోరింది. ఉపాధి లేదా ఇతర ప్రయోజనాల కోసం ఇరాన్‌ వెళ్లాలని సూచించే ఏజెంట్‌లు క్రిమినల్‌ ముఠాలతో కుమ్మక్కై ఉండవచ్చని తెలిపింది. కాబట్టి వారి ట్రాప్‌లో పడకుండా.. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ కూడా వస్తుంది.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాలో ఉద్యోగం వస్తుందనే ఆశతో వెళ్లిన కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఇరాన్‌లో ఓ ముఠా కిడ్నాప్‌ చేసింది. హర్యానాలో ఇమిగ్రేషన్‌ సేవలు అందిస్తున్నట్లు అమన్‌ అనే వ్యక్తి కేరళకు చెందిన హిమాన్షు మాథుర్‌కు పరిచయమయ్యాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. కొంత డబ్బు తీసుకుని ఇరాన్ తీసుకెళ్లాడు. అక్కడ ఓ గ్యాంగ్‌ వీరిని కిడ్నాప్‌ చేసింది. అమన్‌ కూడా ఆ గ్యాంగ్‌లో భాగమేనని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మాథుర్‌ కుటుంబానికి కిడ్నాపర్లు ఫోన్‌ చేసి రూ.కోటి డిమాండ్‌ చేయగా.. చివరకు రూ.20 లక్షలు తీసుకుని విడుదల చేశారు. అంతకుముందు కూడా ముగ్గురు భారతీయ యువకులు టెహ్రాన్‌లో ఇలానే కిడ్నాప్‌కు గురయ్యారు. అనంతరం అక్కడి పోలీసుల సాయంతో బందీలుగా ఉన్న యువకులను విడిపించారు.

 

Exit mobile version