NTV Telugu Site icon

UGC-NET Paper Leak: పేపర్ లీక్‌ కేసు.. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై దాడి..

Cbi

Cbi

UGC-NET Paper Leak: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షల్ని రద్దు చేసింది. ఈ కేసును ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తుంది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తు కోసం వెళ్లిన సీబీఐ అధికారులపై దాడి జరిగింది. బీహార్‌లోని నవడా జల్లాలోని గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే, నకిలీ అధికారులని భావించి గ్రామస్తులు దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపుగా 200 మందిపై కేసులు నమోదు చేశారు.

Read Also: Parenting Tips: పిల్లలు దూకుడుగా మారుతున్నారా? వారిని నియంత్రించడం తప్పనిసరి.. ఈ నియమాలు పాటించండి..

దాడిని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశామని, వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తుల్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు సీనియర్ అధికారి అంబరీష్ రాహుల్ మాట్లాడుతూ, దాడి జరిగినప్పుడు సీబీఐ టీమ్ కసియాదిహ్ గ్రామంలో ఉందని తెలిపారు. స్థానిక పోలీసులు అధికారుల్ని రక్షించారు. టీమ్‌లోని నలుగురు అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్ ఒక వ్యక్తి సెల్‌ఫోన్ ట్రాక్ చేస్తూ ఆ గ్రామానికి వెళ్లారు. అయితే, వారిని గ్రామస్తులు నకిలీ అధికారులని కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఊహించని దాడితో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసుల సమక్షంలో ఈ బృందం విచారణ చేపట్టింది. లొకేషన్‌ ఆధారంగా రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.