నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటి దాకా డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ అధీనంలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించింది.
రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనుక.. ప్రముఖ రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుకు మూడు నెలల క్రితమే ప్రముఖ ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరినే వివాహం చేసుకుంది. కానీ అతడితో సరైన సంబంధాలు లేవన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి మాత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ సహా పలువురు వీవీఐపీలు హాజరయ్యారు. అంతేకాకుండా రన్యారావుకి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆ దిశగా ఫోకస్ పెట్టింది. రన్యారావు పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారు. ఖరీదైన గిఫ్ట్‌లు తీసుకొచ్చింది ఎవరు? అన్న కోణంలో పెళ్లి నాటి వీడియోలను.. మండపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో అధికారులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రన్యారావు.. గతేడాది నుంచి అనేకమార్లు దుబాయ్ వెళ్లింది. ప్రతి ట్రిప్‌లో భారీగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. కానీ ఎన్నడూ పట్టుబడలేదు. వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసింది. రన్యారావు తండ్రి రామచంద్రరావు కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే రన్యారావు తన తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని ఎయిర్‌పోర్టు నుంచే బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు.
అయితే రన్యారావు పాపం పండి.. మార్చి 3న మాత్రం డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆ సమయంలో ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు.. తొడల దగ్గర స్టిక్కర్లు అంటించుకున్నట్లు కనిపెట్టారు. ఇక ఆమె ఇంటి దగ్గర సోదా చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆమె స్నేహితుడు తరుణ్ రాజును అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఆమె భర్త జతిన్ హుక్కేరిపై కూడా దృష్టి పెట్టారు. ఇతడు కూడా పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అసలు ఆమె వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయి. వీఐపీ ప్రొటోకాల్ ఎలా ఉపయోగించుకోగలిగింది అనే అంశంపై సీబీఐ కూపీలాగుతోంది.