మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కు అప్పగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేసింది. కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల ట్విషా శర్మ గత మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు ఇది సాధారణ మరణం కాదని, వరకట్న వేధింపులు, మానసిక హింస కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.
ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిబాలా సింగ్ రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జిగా పనిచేసిన వ్యక్తి కావడం, కేసులో ప్రభావం చూపే అవకాశాలపై ఆరోపణలు రావడంతో దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి Mohan Yadavను కలిసి నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం సీఎం మోహన్ యాదవ్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ట్విషా కుటుంబం రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టును ఆశ్రయించినప్పటికీ, భోపాల్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయితే శవాన్ని సరైన పరిస్థితుల్లో భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
