NTV Telugu Site icon

Kolkata doctor case: డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక మలుపు.. ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’కి హైకోర్టు అనుమతి..

Kolkata Doctor Case, Kolkata Doctor Murder Case

Kolkata Doctor Case, Kolkata Doctor Murder Case

Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్‌ ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’ నిర్వహించాలనే సీబీఐ పిటిషన్‌కి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడు సంజయ్‌రాయ్‌కి రేపు సీబీఐ లై డిటెక్టర్ టెస్టును నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత శుక్రవారం 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమె, రెస్ట్ తీసుకునేందుకు సెమినార్ హాలులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, మహిళలు, సాధారణ ప్రజలు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Read Also: Health: విటమిన్ ‘సి’ ఎక్కువగా తీసుకుంటున్నారా..? జరిగే అనర్థాలు ఇవే..!

ఈ కేసులో ప్రభుత్వం, కోల్‌కతా పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు సీబీఐకి అప్పగించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కి ‘‘సైకలాజికల్ టెస్టు’’ని సీబీఐ నిర్వహించింది. నిందితుడి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ టెస్టుని నిర్వహించారు. నిన్న ఐదుగురు సీబీఐ వైద్యుల బృందం కోల్‌కతా చేరుకుని ఈ టెస్టుని నిర్వహించినట్లు తెలుస్తోంది. సైకలాజికల్ టెస్టులో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్‌లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో, దర్యాప్తు సంస్థ సంజయ్ రాయ్ వాయిస్‌ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు, అంటే లై-డిటెక్టర్ పరికరం, దాని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు.