NTV Telugu Site icon

Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో లాలూపై సీబీఐ చార్జిషీట్ దాఖలు..

Lalu

Lalu

Lalu Prasad Yadav: ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై ‘‘ల్యాండ్ ఫర్ జాబ్’’ స్కామ్‌లో సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లాలూతో సహా చార్జిషీట్‌లో మరో 77 మందిని ఉన్నారు. కాంపిటెంట్ అథారిటీ నుంచి ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని సీబీఐ కోర్టు తెలిపింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ అంశాన్ని జూలై 6న పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. గతంలో మే 29న కోర్టు పూర్తి ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది, తగినంత సమయం ఇచ్చినప్పటికీ ఆలస్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Read Also: Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్

కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ పనిచేసిన సందర్భంలో ఈ స్కామ్ జరిగింది. ఈ కేసులో ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. సీబీఐ ప్రకారం, రెండవ ఛార్జిషీట్‌లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి లాలూ, అతని భార్య, కుమారుడు, అప్పటి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ (డబ్ల్యుసిఆర్) జనరల్ మేనేజర్ (డబ్ల్యుసిఆర్), డబ్ల్యుసిఆర్‌లోని ఇద్దరు చీఫ్ పర్సనల్ ఆఫీసర్లు (సిపిఓలు), ప్రైవేట్ వ్యక్తులు సహా 17 మంది నిందితుల పేర్లు ఉన్నాయి.

2004-09 మధ్యకాలంలో వివిధ రైల్వే జోన్లలో గ్రూప్ డి పోస్టుల కోసం ఉద్యోగ ఆశావహుల నుంచి లాలూ కుటుంబ సభ్యులు ఆస్తులు బదిలీ చేయించుకుని ఆర్థిక ప్రయోజనం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కీలక ప్రాంతాల్లో ఉన్న భూములను సేకరించేందుకు మంత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కుట్ర పన్నినట్లు తేలింది. మంత్రి కుటుంబ సభ్యులకు, లేదా వారు సూచించిన వ్యక్తుల పేర్ల మీదకు భూమిని బదిలీ చేయడం ద్వారా అభ్యర్థులకు ఉద్యోగాన్ని అందించారు.