Site icon NTV Telugu

Bitcoin Scam: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. “బిట్‌కాయిన్ స్కాం”పై సీబీఐ విచారణ

Bitcoin Scam

Bitcoin Scam

Bitcoin Scam: మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ‘‘బిట్‌కాయిన్ స్కాం’’ సంచలనంగా మారింది. ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేపై రిటైర్డ్ ఐపీపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో ఆడిటింగ్ సంస్థకు చెందిన ఉద్యోగికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈరోజు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసిన కొన్ని గంటల తర్వాత ఆడిట్ సంస్థ సారథి అసోసియేట్స్ ఉద్యోగి గౌరవ్ మెహతాకు సీబీఐ సమన్లు ​​పంపింది.

Read Also: Assembly Polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..!

2017లో రూ. 6,600 కోట్ల విలువైన బిట్‌కాయిన్‌లను ఉపయోగించి పోంజి స్కీమ్‌ని నడిపిన దివంగత అమిత్ భరద్వాజ్ అతడి సోదరుడు అజయ్ భరద్వాజ్‌లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 2018 నాటి క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్‌లో ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత నానా పటోలే ప్రమేయం ఉందని రిటైర్డ్ ఐపీఎస్ రవీంద్రనాథ్ పాటిల్ ఆరోపించిన తర్వాత ఈ అంశం మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయంగా సంచలనమైంది. ఎన్నికల ప్రచారంలో ఈ డబ్బును ఉపయోగించినట్లు పాటిల్ ఆరోపించారు.

సుప్రియా సూలే, నానాపటోలే తో పాటు మాజీ పోలీస్ కమిషనర్, డీలర్‌తో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వీరికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విడుదల చేశారు. ఈ ఆడియో క్లిప్ రిలీజైన ఒక రోజు తర్వాత సీబీఐ విచారణ ప్రారంభమైంది. అయితే, బీజేపీ ఆరోపణల్ని సుప్రియా సూలే ఖండించారు. రికార్డింగ్‌లో వాయిస్ తనది కాదని అన్నారు. బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

Exit mobile version