Site icon NTV Telugu

Indian Railways: ఆగస్టు 1 నుంచి రైల్వే స్టేషన్‌లలో కొత్త నిబంధనలు

Railway Stations 1

Railway Stations 1

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో విక్రయిస్తారు. ఇలా చేయకుంటే రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం విక్రేతలు తప్పనిసరిగా యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషిన్‌లు, స్వైప్ మెషీన్‌లను కలిగి ఉండటం తప్పనిసరి అని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాకుండా ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని సూచించింది.

Read Also: Andhra Pradesh: ఏపీలో ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారంపై ఏ వస్తువునైనా ఎమ్మార్పీ ధరకే స్టాళ్ల నిర్వాహకులు విక్రయించనున్నారు. ఇప్పటివరకు రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి అమ్మి ప్రయాణికులను స్టాళ్ల నిర్వాహకులు దోచుకునేవారు. క్యాష్ లెస్ చెల్లింపులతో ఇకపై ఎక్కువ ధరకు విక్రయించలేరు. క్యాటరింగ్ క్యాష్‌లెస్ చెల్లింపులపై గతంలో రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలు, ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది. స్టాల్స్‌తో పాటు ట్రాలీలు, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో నగదు రహిత లావాదేవీలు జరుగుతాయని రైల్వే బోర్డు వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా 7వేల రైల్వే స్టేషన్లలో 30వేల స్టాళ్లతో పాటు ట్రాలీలు అందుబాటులో ఉన్నాయి. ఐఆర్‌సీటీసీకి చెందిన 289 పెద్ద స్టాళ్లు, జన్ ఆహార్, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్లు రైల్వే స్టేషన్‌లలో ఉన్నాయి.

Exit mobile version