Site icon NTV Telugu

Annamalai: అన్నామలైపై క్రిమినల్ కేసు.. వివాదంగా పవన్ కళ్యాణ్ హాజరైన సభ..

Annamalai

Annamalai

Annamalai: ఇటీవల మధురై కేంద్రంగా మురుగన్ భక్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేశారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కే. అన్నామలైపై, హిందూ మున్నాని గ్రూపులోని ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వంజినాథన్ అనే న్యాయవాది ఆరోపించారు. ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా అన్నామలై, హిందూ మున్నాని రాష్ట్ర నాయకుడు కాదేశ్వర సుబ్రమణ్యం, మున్నాని కార్యకర్త సెల్వకుమార్‌ ప్రసంగించారని కేసులు పెట్టారు.

Read Also: Covid Vaccine: కోవిడ్ తర్వాత మరణాలకు వాక్సిన్‌లు కారణం కాదు.. తాజా అధ్యయనంలో వెల్లడి..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ రాజేంద్రన్ హాజరైన ఈ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమంలో పలువురి ప్రసంగాలు, తీర్మానాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మతపరమైన భావాలను దెబ్బతీసేలా మాట్లాడటం, శత్రుత్వాన్ని కలిగించడం మరియు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు BNSS సెక్షన్ 196 (1) (a), 299, 302 , 353 (1) (2) (B) కింద అన్నా నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మద్రాస్ హైకోర్టు నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపించారు.

అయితే, అన్నామలైపై కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో ముందస్తు అనుమతి లేకుండా చెన్నైలో బ్లాక్ డే ఊరేగింపు నిర్వహించిందుకు అన్నామలైతో పాటు 900 మందికి పైగా బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కోయంబత్తూర్ పేలుళ్ల దోషి అంత్యక్రియల ఊరేగింపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అన్నామలై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై డీఎంకే సర్కార్ అన్నామలైపై కేసు నమోదు చేసింది.

Exit mobile version