Digvijaya Singh: రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని బలవంతంగా ఒప్పించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోతే.. ఆ పదవి చేపట్టేలా ఆయనను బలవంతం చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మనసు మార్చుకోవాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేసిన ఒకరోజు తర్వాత దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
జాతీయ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం కారణంగా 2019లో రాజీనామా చేసిన పదవికి తిరిగి రావడానికి రాహుల్ గాంధీ నిరాకరించారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు సమీపించాయి. సెప్టెంబరు 20లోగా కొత్త చీఫ్‌ని ఎన్నుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
రాహల్ గాంధీ మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తారా అని దిగ్విజయ్ సింగ్‌ను విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. “ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అందరికీ తెలుసు. అయితే నిర్ణయం పూర్తిగా రాహుల్ గాంధీపై ఆధారపడి ఉంటుంది. ఆయనను బలవంతంగా ఒప్పించలేం” కదా అని ఆయన చెప్పారు. తాము అందరినీ బోర్డులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ భవిష్యత్ ఉజ్వలంగా ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Asaduddin Owaisi: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ
ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ వాద్రా పేరు కూడా తెరపైకి వస్తోంది. గాంధీ కుటుంబంలోని వారే ఈ బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని అత్యధికులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆ పాత్రలో కొనసాగలేనని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విపత్తు నుండి రక్షించడంలో విఫలమైన ప్రియాంక గాంధీ వాద్రాను పగ్గాలు అప్పగించకపోవచ్చని సమాచారం. దీంతో తదుపరి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే నేత ఎవరో సందిగ్ధత వీడట్లేదు.
