రాబోయే 3 సంవత్సరాల్లో జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం పార్లమెంట్‌లో నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేన్సర్ చికిత్సపై కీలక ప్రకటన చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ టూరిజం మరియు హీల్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ కేన్సర్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ సమర్పణ సందర్భంగా ప్రకటించారు. వీటిలో 200 కేంద్రాలను 2025-26లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా 10,000 సీట్లు వస్తాయని, వచ్చే ఐదేళ్లలో ఈ కాలేజీల్లో 75,000 సీట్లు అదనంగా వస్తాయని నిర్మలమ్మ చెప్పారు. రోగులకు.. ముఖ్యంగా కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకు, 36 ప్రాణాలను రక్షించే మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు జాబితాలో చేర్చాలని ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.