Site icon NTV Telugu

Hardeep Nijjar killing: నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తం ఉంది.. సిక్కు ఎంపీ ఆరోపణలు..

Jagmit Singh

Jagmit Singh

Hardeep Nijjar killing: ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది కెనడాలోని సర్రే నగరంలో హత్యకు గురయ్యాడు. అయితే, ఈ కేసులో ముగ్గుర భారతీయులను కెనడాలోని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే కెనడాలో సిక్కు ఎంపీగా ఉన్న జగ్మీత్ సింగ్ భారత్‌ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ హత్య వెనక భారత ప్రభుత్వం ఉందని, నిజ్జర్‌ని చంపేందుకు ముగ్గురు నిందితులను భారత ప్రభుత్వం కిరాయి హంతకులను నియమించిందని, ఈ ఘటన భారత్‌తో దౌత్యపరమైన ఘర్షణకు కారణమైందని పేర్కొన్నాడు.

Read Also: YouTuber Arrested: మహిళా పోలీసులపై నోటి దురద వ్యాఖ్యలు.. యూట్యూబర్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్!

అయితే, అరెస్టైన ముగ్గురు నిందితులకు భారత ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు కెనడా పోలీసులు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. కెనడా న్యూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ.. కెనడియన్ గడ్డపై ప్రార్థనా స్థలంలో కెనడియన్ పౌరుడి హత్య చేయడానికి భారత ప్రభుత్వం కిరాయి హంతకులను నియమించిందని, ఈ రోజు ముగ్గురిని అరెస్ట్ చేశారని అన్నారు. కెనడా కోసం, ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం కోసం ఈ హత్యకు ఆదేశించి, ప్లాన్ చేసిన, అమలు చేసిన ఏ భారతీయ ఏజెంట్‌నైనా కెనడా చట్టం కిందకు తీసుకురావాలని, హర్దీప్ సింగ్ నిజ్జార్‌కి న్యాయం జరగాలని జగ్మిత్ సింగ్ ట్వీట్ చేశారు.

నిజ్జర్ హత్య కేసులో శుక్రవారం ముగ్గురు భారతీయులు కరణ్‌ప్రీత్ సింగ్(28), కమల్‌ప్రీత్ సింగ్(22), కరణ్ బ్రార్(22)లను అరెస్ట్ చేశారు. నిందితులను కొన్ని నెలల క్రితమే గుర్తించామని, వారిపై గట్టి నిఘా పెట్టామని పోలీసులు చెప్పారు. నిందితులంతా భారతీయులు, కెనడాలో శాశ్వత నివాసితులు కాదని పోలీసులు తెలిపారు. నిజ్జర్ హత్య జరిగిన రోజున ముగ్గురూ షూటర్లుగా, డ్రైవర్లుగా, స్పాటర్లుగా వేర్వేరు పాత్రలు పోషించారని పోలీసులు తెలిపారు. వీరికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version