Delhi Deputy CM Post: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్‌పై రిలీజ్ కావడంతో ప్రస్తుతం కొత్త వాదనకు తెరలేచింది. సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమించబోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉండడంతో సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉంటడం వల్ల ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా పార్టీకి బలం చేకూరుతుందని ఆప్ నేతలు అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆయనను త్వరలోనే మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి.. కీలకమైన ఆర్థిక, విద్యా శాఖలు కేటాయిస్తారని తెలుస్తుంది.
Read Also: Success Story: పాత బట్టలతో బొమ్మల తయారీ..ఏటా రూ. 75 లక్షల సంపాదన!
కాగా, గతేడాది ఫిబ్రవరిలో అరెస్టైన తర్వాత మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసేశారు. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో దాదాపు 17 నెలల పాటు శిక్ష అనుభవించిన తర్వాత సిసోడియాకు శుక్రవారం (ఆగస్టు 9) సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో నిన్న సాయంత్రమే ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యారు. కాగా, ప్రస్తుతం సిసోడియా ఎమ్మెల్యేగా ఉన్నారు.