తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు భారీ ఊరట లభించింది. ఆమె భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆమెకు భద్రతను పెంచాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించింది. ఆమెపై గుడ్లు విసిరిన ఘటన నేపథ్యంలో తగినంత మంది సాయుధ సిబ్బందితో భద్రత కల్పించాలని సూచించింది. బహిరంగ కార్యక్రమాలు, రాజకీయ ర్యాలీల్లో పాల్గొనే సమయంలో ఎంపీకి తగిన భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మహువా మొయిత్రా తన నియోజకవర్గమైన కృష్ణానగర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నదియా జిల్లాలో ఆమె కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొందరు నిరసనకారులు గుమిగూడారు. వారు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో పాటు ఆమె వాహనంపై గుడ్లు విసిరినట్లు సమాచారం. ఈ ఘటనపై మహువా మొయిత్రా హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసులపై ఎంపీ ఆరోపణలు
తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. నిరసనకారులను చెదరగొట్టేందుకు లేదా ముందస్తు చర్యలు తీసుకోవడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని మహువా మొయిత్రా తన పిటిషన్‌లో ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పదేపదే చోటుచేసుకోవడంతో ఎంపీగా తన విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజలను కలవడం, స్థానిక మౌలిక వసతుల ప్రాజెక్టులను పరిశీలించడం వంటి అధికారిక కార్యక్రమాల కోసం నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కును పరిరక్షించేలా న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు.
‘ఎంపీపైనే గుడ్లు విసిరితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి?’
ఈ పిటిషన్‌పై జస్టిస్ రాజర్షి భారద్వాజ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల భద్రత, శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసుల సామర్థ్యంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఒక ఎంపీపై బహిరంగంగా గుడ్లు విసిరితే.. ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి?” అని జస్టిస్ రాజర్షి భారద్వాజ్ ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎలాంటి బెదిరింపులు, గుంపుల అడ్డంకులు లేకుండా తమ రాజకీయ, అధికారిక విధులను నిర్వహించగలగాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా శాంతిభద్రతలను కాపాడటం, రాజకీయ నాయకులపై లక్ష్యంగా జరిగే హింసను అడ్డుకోవడం స్థానిక పోలీసుల చట్టబద్ధ బాధ్యత అని పేర్కొంది.
భద్రతపై ఎస్పీకి బాధ్యత
మహువా మొయిత్రాకు ఉన్న ముప్పు స్థాయిని నదియా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వెంటనే అంచనా వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆమె బహిరంగ కార్యక్రమాలు, రాజకీయ ర్యాలీలకు హాజరయ్యే సమయంలో తగినంత మంది సాయుధ పోలీసులను భద్రతగా ఏర్పాటు చేయాలని సూచించింది.
మహువా మొయిత్రాపై గుడ్లు విసిరిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై మహువా మొయిత్రా పాల్గొనే బహిరంగ కార్యక్రమాల్లో పోలీసుల బందోబస్తును పెంచుతామని కోర్టుకు హామీ ఇచ్చింది. వాదనలు విన్న అనంతరం హైకోర్టు మహువా మొయిత్రా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను పరిష్కరించింది. అయితే ఆమె రాబోయే బహిరంగ కార్యక్రమాలకు కల్పించే భద్రతా ఏర్పాట్లపై పూర్తి వివరాలతో కంప్లయన్స్ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ప్రజాప్రతినిధుల భద్రత, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ చట్టబద్ధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కోర్టు స్పష్టం చేసింది.

