Site icon NTV Telugu

Semiconductor Plants: దేశంలో 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు క్యాబినెట్ ఆమోదం.. పెట్టుబడి విలువ రూ. 1.26 లక్షల కోట్లు..

Semiconductor

Semiconductor

Semiconductor Plants: ఎలక్ట్రాన్సిక్స్, ఆటోమొబైల్ రంగంతో పాటు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతో కీలకమైన సెమీకండక్టర్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చైనా, తైవాన్ వంటి దేశాల గుత్తాధిపత్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లోనే చిప్ తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు భారతదేశంలో మూడు సెమీకండక్టర్ల ప్లాంట్లనను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. రానున్న 100 రోజుల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రధాని నరేంద్రమోడీ సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని, మొదటి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌ని టాటా-పవర్ చిప్ తైవాన్ ఏర్పాటు చేస్తుందని అశ్విణి వైష్ణవ్ తెలిపారు. దీని ప్లాంట్ గుజరాత్‌లోని ధోలేరాలో ఉంటుంది. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్, పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్‌తో కలిసి గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.

Read Also: Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 30,000 దాటిన మృతుల సంఖ్య…

రూ. 27,000 కోట్లతో అస్సాంలోని మోరిగావ్‌లో టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ఏర్పాటు చేస్తుంది. CG పవర్, జపాన్‌కు చెందిన రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్ప్ మరియు థాయ్‌లాండ్‌కు చెందిన స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో గుజరాత్‌ని సనంద్ లో మరో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మూడు ప్లాంట్ల మొత్తం పెట్టుబడి రూ. 1.26 లక్షల కోట్లు. ఈ మూడు కలిసి ఏడాదికి దాదాపుగా 3 బిలియన్ చిప్‌లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గుజరాత్ ధోలేరాలోని సెమీకండక్టర్ ఫ్యాబ్ పెట్టుబడి రూ. 91,000 కోట్లు కాగా.. అస్సాంలోని టాటా యొక్క సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ – 27,000 కోట్లు, గుజరాత్ సనంద్‌లోని సీజీ పవర్ ప్లాంట్ పెట్టుబడి రూ. 7600 కోట్లు.

Exit mobile version