Site icon NTV Telugu

5G Spectrum: కేంద్రం కీలక నిర్ణయం.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేబినెట్ ఆమోదం

Spectrum

Spectrum

కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, సంస్థలకు 5జీ సేవలను అందించడానికి విజయవంతమైన బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ జులై 2022 చివరి నాటికి వేలం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 5G సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని.. అలాగే అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇతర కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రాధాన్య అంశంగా ఉంది’’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘‘బ్రాడ్ బ్యాండ్, మరీ ముఖ్యంగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ప్రజల రోజువారీ జీవితాల్లో భాగంగా మారిపోయింది. 2015 నుంచి 4జీ సేవలు దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరించడం ఇందుకు దోహదపడింది. నేడు 80 కోట్ల మంది టెలికం సబ్ స్క్రయిబర్లు బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందుతున్నారు. 2014లో బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రయిబర్లు 10 కోట్లుగానే ఉన్నారు’’ అని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.

5జీ సేవలు నూతన తరం వ్యాపారాల సృష్టికి తోడ్పడతాయని, సంస్థలకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు తెచ్చిపెడతాయని కేంద్ర సర్కారు పేర్కొంది. జులై నెలాఖరుకి వీటిని వేలానికి తీసుకురానున్నట్టు పేర్కొంది.

Exit mobile version