NTV Telugu Site icon

Bulldozer action: అయోధ్య గ్యాంగ్‌రేప్ నిందితుల ఆస్తులపై బుల్డోజర్ యాక్షన్

Ayodhya

Ayodhya

అయోధ్యలో గ్యాంగ్‌రేప్ నిందితుల ఆస్తులపై యోగి ప్రభుత్వం యాక్షన్‌కు దిగింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాధిత కుటుంబం కలిసింది. సీఎంను కలిసిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుల ఆస్తులపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. అయోధ్య జిల్లా యంత్రాంగం శనివారం బుల్డోజర్‌తో అత్యాచార నిందితుడు మోయిద్ ఖాన్ బేకరీపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసింది. మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.

ఈ బేకరీని ఆహార కల్తీ విభాగం సీల్ చేయగా.. శనివారం కూల్చివేత చర్యలు ప్రారంభించింది. బేకరీ చట్టవిరుద్ధమని గుర్తించిన తర్వాత సీల్ చేశామని, బేకరీని కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌డిఎం సోహవాల్ అశోక్ కుమార్ తెలిపారు. నిందితులకు సంబంధించిన మరికొన్ని ఆస్తులు కూల్చివేసే అవకాశం ఉంది.

అయోధ్యలో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శుక్రవారం కలిశారు. సమావేశం తర్వాత కేసు దర్యాప్తులో ఆలస్యం చేసినందుకు ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతని ఉద్యోగి రాజు ఖాన్‌ను జూలై 30న పురకాలందర్ ప్రాంతంలో అరెస్టు చేశారు.

పోలీసు వర్గాల ప్రకారం.. రెండు నెలల క్రితం బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వైద్య పరీక్షల్లో గర్భవతి అని తేలింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వాంగ్మూలంతో కేసు నమోదైంది. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ… మొయిద్ ఖాన్ సమాజ్ వాదీ పార్టీకి చెందినవాడని పేర్కొన్నారు. అలాగే అయోధ్య ఎంపీకి సంబంధించిన వ్యక్తి కూడా అని తెలిపారు. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. అయినా కూడా సమాజ్ వాదీ పార్టీ అతనిపై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

బీజేపీ చర్యలపై సమాజ్‌వాదీ పార్టీ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిందితులందరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలకు పాల్పడకుండా న్యాయం కోసం తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారందరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కోరింది. దోషులు చట్ట ప్రకారం పూర్తి శిక్షను అనుభవించాలన్నారు. కానీ DNA పరీక్షల్లో ఆరోపణలు తప్పు అని రుజువు చేస్తే ప్రమేయం ఉన్న ప్రభుత్వ అధికారులను కూడా విడిచిపెట్టకూడదని డిమాండ్ చేశారు. యూపీ ప్రభుత్వం.. సమాజ్‌వాదీ పార్టీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ పేర్కొంది. బాధితురాలికి సహాయం చేయడానికి బదులు సమాజ్‌వాదీ పార్టీ పరువు తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలిపింది. ప్రభుత్వం తక్షణమే బాధితురాలికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఎస్పీ పార్టీ డిమాండ్ చేసింది.

అయోధ్య అత్యాచారం కేసులో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సముచితమని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు.. అయితే నిందితులు DNA పరీక్ష చేయించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ప్రకటనను మనం ఏమి చేయాలి? తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి నిందితులకు ఎన్ని డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారో కూడా సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేయాలన్నారు.