Nirmala Sitharaman: 2025 కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్నుల ప్రకటనలు, రిబేట్ సీలింగ్ రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిందని అన్నారు. శనివారం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. రిబేట్ పెంపు కారణంగా ఒక కోటి మంది పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను చెల్లించరని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘‘మాది స్పందించే ప్రభుత్వమని, ఫలితంగా జూలైలో నేను ప్రకటించిన ఆదాయపు పన్ను సరళీకరణ ఇప్పటికి పూర్తయింది. మేము వచ్చే వారం బిల్లును తీసుకువస్తాము. కాబట్టి పన్నులతో సహా సంస్కరణల గురించి పని పూర్తి చేశాం’’ అని ఆర్థిక మంత్రి అన్నారు.
Read Also: Rahul Gandhi: ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ’’.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
పన్ను స్లాబులను విమరించేందుకు నిర్మలా సీతారామన్ రెండు ఉదాహరణలను చెప్పారు. రూ. 12 లక్షల వరకు సంపాదించే వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించరు. ఇది మునుపటి నిర్మాణం నుంచి గణనీయమైన మార్పుని సూచిస్తుంది. గతంలో వారు రూ. 60,000 నుంచి రూ. 80,000 మధ్య చెల్లించాల్సి వచ్చేది. రూ. 8 లక్షలు సంపాదించే వ్యక్తులు 2024-25 పన్నుల ప్రకారం రూ. 30,000 చెల్లించారు. ప్రస్తుతం పన్ను స్లాబుల్లో మార్పుల వల్ల వారు రూ. 20,000 మాత్రమే చెల్లిస్తారని, రూ. 10,000 పొదుపు అవుతుందని చెప్పారు.
సవరించిన కొత్త పన్ను స్లాబులు అధిక సంపాదనదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె అన్నారు. ఉదాహరణకు రూ. 24 లక్షలు అంతకన్నా ఎక్కువ సంపాదించే వ్యక్తులు పాత వ్యవస్థ కింద కనీసం రూ. 4.1 లక్షలు పన్నులు చెల్లిస్తారని, సవరించిన దాని ప్రకారం.. వారు రూ. 3 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, అంటే రూ. 1.1 లక్షల్ని పొదుపు చేసుకోవచ్చని అన్నారు. ఫలితంగా పన్ను స్లాబుల పునర్నిర్మాణం ద్వారా మధ్యతరగతి వినియోగదారుల చేతుల్లోకి గణనీయమైన డబ్బు చేరుతుందని చెప్పారు. సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1 లక్షకు రెట్టింపు చేస్తామని అన్నారు.